
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని, 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ప్రభుత్వం.. కేంద్రం ఆమోదిస్తేనే అమలవుతుందని తెలుసుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో రెండుసార్లు ఆర్డినెన్స్ ఇచ్చినా అమలు కాలేదని, రాష్ట్రప్రభుత్వ తీరు బీసీలను మభ్యపెట్టేందుకేనన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 4 లక్షల టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టి ఎరువులు అందించారని, పల్లెప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు అందించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు అసెంబ్లీ, సచివాలం ముట్టడి చేపట్టి కేసుల పాలయ్యారుగానీ.. బిల్లులు మాత్రం తెచ్చుకోలేకపోయారని తెలిపారు. రైతుభరోసా కొంతమందికే ఇచ్చారని, రూ.500 బోనస్‌కు మంగళం పాడారని పేర్కొన్నారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని రూపాయి ఇవ్వలేదన్నారు. యువవికాసం బోగస్ అన్నారు. పెన్షన్ల పెంపు, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. పచ్చి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకొచ్చిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, నాయకులు రమణారావు, లోక బాపురెడ్డి, హరిచరణ్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత
పల్లెల్లో కుంటుపడిన పారిశుధ్యం
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్