
ఆకతాయిల ఆగడాలకు చెక్
● మహిళల భద్రతకు షీ టీమ్‌లు ● అవగాహన కల్పిస్తున్న పోలీసులు ● ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు
జగిత్యాలక్రైం: జిల్లాలో విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీం చక్కగా పనిచేస్తున్నాయి. వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నాయి. ప్రత్యేకంగా జనసంచారం ఉన్న చోట మఫ్టీలో తిరుగుతూ నిందితులను పట్టుకుంటున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి వంటి పట్టణాలు, మండల కేంద్రాల్లోని బస్టాండ్ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారు. తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. అయినా వారికి ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు.
భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, విద్యార్థుల రక్షణకు షీటీం బృందాలు నిరంతరం కృషిచేస్తున్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీమ్‌లో ఎస్సై స్థాయి అధికారితో పాటు మహిళ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు.
అవగాహన సదస్సులు
ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. చీటింగ్‌పై పోలీసు శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 43 చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 172 అడ్డాలను గుర్తించారు. ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు రాగా.. ఐదు కేసుల నమోదుతోపాటు, 35 మందిపై ఈపెట్టీ కేసులు నమోదు చేసి.. 46 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 70783కి వాట్సాప్ నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
కార్యక్రమాలు విస్తృతపరచాలి
షీటీం పోలీసులు అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. షీటీం పోలీసుల అవగాహన సదస్సలు బాగున్నాయి. – మారు సత్తమ్మ,
మహిళా సంఘం అధ్యక్షురాలు, జగిత్యాల
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
బస్టాండ్, పాఠశాలలు, కళాశాలల వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– అశోక్‌కుమార్, ఎస్పీ

ఆకతాయిల ఆగడాలకు చెక్

ఆకతాయిల ఆగడాలకు చెక్