
విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి
సారంగాపూర్(జగిత్యాల): పొలాల వద్ద విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ప్రమాదాలకు తావుండదని సీజీఆర్‌ఎఫ్ (కన్జుమర్ గ్రీవెన్స్ రీఅడ్రెస్సల్ ఫోరం) చైర్‌పర్సన్ నారాయణ అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బీర్‌పూర్, సారంగాపూర్, రాయికల్ మండలాల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నందున పంటల సాగు బాగా ఉందని, రైతులు తమ పొలాల వద్ద కొత్తగా మోటార్లు ఏర్పాటు చేసుకుంటే దానికి అనగుణంగా డీడీలు చెల్లించాలని, దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తే మరింత మెరుగైన సరఫరా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. తాను వచ్చిన దారిలో పొల్లాలో పోల్స్ వంగి ఉన్నాయని, వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజాగౌడ్, ఎస్‌ఈ సుదర్శన్, అకౌంట్స్ అధికారి తిరుపతి, డీఈ రాజిరెడ్డి, ఏడీఈ సింధూశర్మ, ఏఈలు శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, రాజేశం, సిబ్బంది, పాల్గొన్నారు. పరిష్కార వేదికలో లైన్ల షిఫ్టింగ్ 2, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు 2, మరో 6 దరఖాస్తులు రాగా వాటిని పరిష్కరించారు.