
మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. వారి నేత్రాలను దానం చేసి, నలుగురికి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచాయి వారి కుటుంబాలు. గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కడారి చంద్రయ్య(61), ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు.. చంద్రయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. అలాగే స్థానిక విలేజ్ రామగుండానికి చెందిన అంబాడి రాజశేఖర్(55) ఈనెల 7న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలుదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీజీహెచ్‌లో టెక్నీషియన్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసుతోపాటు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ అభినందించారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కళ్లు దానం చేసిన రెండు కుటుంబాలు
అభినందించిన సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్

మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు