పరిష్కారంపైనే ఆశలు
ముగిసిన
సదస్సులు..
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో అనేక తప్పులు దొర్లాయని, దరఖాస్తు చేసుకున్నా.. మార్చే అవకాశం లేకపోవడంతో రైతులు కార్యాలయం చుట్టూ తిరిగారని, సీసీఎల్‌కు వెళ్తే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం రైతులు దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. ముందుగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలాన్ని ఎంపిక చేశారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 3 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
37,931 దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 300 గ్రామాల నుంచి 37,931 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రస్తుతం వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. గతంలో చేసిన తప్పిదాలతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒకరి పేరు బదులు మరొకరు, విస్తీర్ణంలో వ్యత్యాసం, మిస్సింగ్ సర్వే నంబర్లు, నిషేధిత జాబితాలో చేర్చడం, పట్టాదారు పాస్‌బుక్‌లు రాకపోవడం, కొన్ని నంబర్లు కన్పించకపోవడం వంటి అనేక సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. కొందరికి భూమి ఉండి కూడా రైతుబంధు అందుకోని రైతులు ఉన్నారు. అంతేకాక పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే పట్టాదారు పాస్‌బుక్‌లో నంబర్లు లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నూతన చట్టం తేవడంతో పాటు, కొన్ని సమస్యలను తహసీల్దార్ స్థాయిలో చేపట్టగా, మరికొన్ని సమస్యలు ఆర్డీవో, కఠిన సమస్యలు కలెక్టర్ పరిష్కరించేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. గతంలో ధరణి చట్టంలో కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులకు ఏదైనా సమస్యలున్నా అప్పీల్ చేసే అవకాశం సైతం కల్పించారు.
సాదాబైనామాలే అత్యధికం
జిల్లాలో అత్యధిక దరఖాస్తులు సాదాబైనామాలకే వచ్చాయి. 8,667 సాదాబైనామాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కొందరు గతంలో తెల్ల కాగితంపై భూ క్రయవిక్రయాలు చేసే వారు. అవి రిజిస్ట్రేషన్ కాకపోవడం, భూముల ధరలు పెరిగిపోవడంతో తిరగబడ్డారు. రైతులు కబ్జాలో ఉన్నప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అధికారులు వాటిపై ఫోకస్ పెట్టారు. రెవెన్యూ గ్రామాల వారిగా నోటీసులు జారీ చేసి సమస్యలను పరిష్కరించేలా ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
జిల్లాలో భూభారతికి వచ్చిన దరఖాస్తుల వివరాలు
సాదాబైనామాలు 8,667
నోషనల ఖాతా పట్టా 1,080
నాలా హౌస్‌సైట్ 15
పట్టాదారు పాస్‌ల కోసం 32
పట్టా ల్యాండ్‌లో ఇతరుల పేర్లు 278
సేత్వార్ కనెక్షన్ 5
ఆధార్ కరెక్షన్ 52
అసైన్డ్‌మెంట్ పట్టా 153
ల్యాండ్ డిస్ప్యూట్ 54
పీవోటీ 110
ఖాతా మెర్జింగ్ 19
సర్వేనంబర్ కరెక్షన్ 30
ఎఫ్‌లైన్ పిటిషన్ 459
రెవెన్యూ సదస్సులకు అర్జీల వెల్లువ
జిల్లావ్యాప్తంగా 39,931 దరఖాస్తులు
సాదాబైనాలు, మిస్సింగ్ సర్వేనంబర్లే అధికం
దరఖాస్తుల పరిశీలన
రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిష్కరించి ఫిర్యాదులు సమర్పించిన రైతులతోపాటు, సమీపంలోని రైతులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇరువురి వద్దనున్న రికార్డులతో పాటు, ఆధారాలు సమర్పించిన తర్వాత వారం రోజుల గడువు విధించి ఆ లోపు సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతారు.
సమస్యలకు పరిష్కారం
భూ భారతి చట్టంతో రైతుల సమస్యలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్ద నుంచి సమస్యలను స్వీకరించాం. త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేస్తాం. అనంతరం అన్ని విషయాల్లో విచారణ జరిపి పరిష్కరిస్తాం.
– సత్యప్రసాద్, కలెక్టర్
పరిష్కారంపైనే ఆశలు


