
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి
జగిత్యాలరూరల్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన తడిసిన ధాన్యంను కూడా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, గోపాల్‌రావుపేట, మూటపల్లి, భూపతిపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అకాల వర్షాలతో వాహనాల ఇబ్బంది, తూకం సమస్య ఏర్పడటంతో కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని కూడా వెనువెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలని అన్నారు. గతేడాది ఈ సమయానికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగగా, ప్రస్తుతం ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని తెలిపారు. గతంలో కన్నా మెరుగ్గా ఉందని, గతంలో లాగా వడ్లు పట్టడం, కటింగ్‌లు లాంటి కోతలు లేవన్నారు. ప్రభుత్వం తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తుందని, ఇప్పటికే కలెక్టర్, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
గంగమ్మతల్లి ఆలయంలో జీవన్‌రెడ్డి పూజలు
జగిత్యాలరూరల్(రాయికల్): రాయికల్ మండలం భూపతిపూర్‌లో శుక్రవారం నిర్వహించిన గంగమ్మతల్లి బోనాల పండుగలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలుచేశారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.