
బల్దియాలో కీలక పోస్టులు ఖాళీ
● కుంటుపడుతున్న అభివృద్ధి ● కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రజలు
జగిత్యాల: జిల్లా కేంద్రం.. లక్షకు పైగా జనాభా.. 48 వార్డులు.. గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. మున్సిపాలిటీలో అతిముఖ్యమైన విభాగం టౌన్‌ప్లానింగ్. ఇందులో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీపీవోగా ఉన్న శ్రీనివాస్ జగిత్యాలతోపాటు ధర్మపురికి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈయనకు డీటీసీపీవో ఇన్‌చార్జి సైతం ఇచ్చారు. ఈ విభాగంలో టీపీఎస్‌లు ఇద్దరు ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేరు. టీపీవోలు ముగ్గురు లేరు. చైన్‌మెన్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా.. నలుగురే ఉన్నారు. ఈ విభాగంలో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో రోడ్లు ఆక్రమించుకున్నా, ఎంక్రోచ్‌మెంట్లు చేసుకున్నా.. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించినా వీరే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో టీపీవోపై అధిక భారం ఉండటంతో ఫిర్యాదులు ఇచ్చినా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో అనేకంగా రోడ్లపై ఎంక్రోచ్‌మెంట్లు జరుగుతున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగంలోనూ ముఖ్యమైన పోస్టు డీఈ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. మెట్‌పల్లి డీఈని జగిత్యాల మున్సిపాలిటీ ఇన్‌చార్జిగా నియమించారు. ఇద్దరు ఏఈలు ఉన్నప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా పనులను వీరే పరిశీలించాల్సి ఉంటుంది. నాణ్యత ఉందా..? లేదా..? సీసీరోడ్లు ఏ విధంగా వేస్తున్నారు..? వంటివాటితోపాటు తాగునీటి సరఫరా కూడా వీరే చూడాల్సి ఉంటుంది. అతి ముఖ్యమైన డీఈ పోస్టు లేకపోవడం ఆ శాఖలో ఇబ్బందిగా మారింది. శానిటేషన్ విభాగంలోనూ ఒక్క శానిటరి ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే కొత్త శానిటరీ ఇన్‌స్పెక్టర్ వచ్చారు. వీరిద్దరూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారే. జవాన్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పారిశుధ్యం చేపట్టడంలో శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో నాలుగు జోన్లు ఉండగా.. కొన్ని జోన్లలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో మ్యూటేషన్లు, అసెస్మెంట్ కాపీలు, పహాణిలు అవసరమై ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. గతంలో ఆర్వోగా పనిచేసిన ఆయన కేసులో ఇరుక్కుని వెళ్లిపోవడంతో ఇన్‌చార్జిగా మరొకరిని నియమించారు. కానీ ఈ సెక్షన్‌లో పూర్తిస్థాయి అధికారులు లేరు. ఫలితంగా మ్యూటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అసెస్‌మెంట్ల, ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు లేకపోవడంతో సకాలంలో అందడం లేదన్న ఆరోపణలున్నాయి. బల్దియాలో 48 వార్డులు ఉన్నప్పటికీ 33 మంది వార్డు ఆఫీసర్లను మాత్రమే ఇచ్చారు. ఇంకా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన మేనేజర్ పోస్టు ఉండాల్సి ఉండగా.. ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో అది కూడా ఖాళీగానే ఉంది. బిల్‌కలెక్టర్లు 9 మందికి ఇద్దరు మాత్రమే ఉన్నారు.
అభివృద్ధికి ఆటంకం
బల్దియాలో అతికీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. ఇంతకు పూర్వం ఇన్‌చార్జి కమిషనర్లు ఉన్నప్పటికీ ఇటీవలే నూతన కమిషనర్‌గా స్పందన బదిలీపై వచ్చారు. కానీ కిందిస్థాయిలో కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఉన్నతాధికారులపై భారం పడటంతోపాటు అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కీలకమైన పోస్టులు భర్తీ చేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
భర్తీ చేసేలా చర్యలు
మున్సిపాలిటీలో కీలకపోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. త్వరలో భర్తీ అయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల్లో రెగ్యులర్ వారు లేకపోవడం ఇబ్బందిగా ఉంది. త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– స్పందన, మున్సిపల్ కమిషనర్

బల్దియాలో కీలక పోస్టులు ఖాళీ

బల్దియాలో కీలక పోస్టులు ఖాళీ