డీజిల్‌ దోపిడీ అరికట్టేదెలా? | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ దోపిడీ అరికట్టేదెలా?

May 7 2025 12:08 AM | Updated on May 7 2025 12:08 AM

డీజిల్‌ దోపిడీ అరికట్టేదెలా?

డీజిల్‌ దోపిడీ అరికట్టేదెలా?

● ఇంధన వినియోగంపై గతం నుంచే ఆరోపణలు ● నోరు మెదపని బల్దియా ఉన్నతాధికారులు

జగిత్యాల: ప్రజల సొమ్మే కదా.. స్వాహా చేస్తే ఏమవుతుందిలే.. అన్న చందంగా మారింది జగిత్యాల మున్సిపాలిటీ వ్యవహారం. బల్దియాలో డీజిల్‌ దోపకంలో నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలువురు కౌన్సిలర్లు కలెక్టర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. డీజిల్‌కు రూ.10లక్షలకు పైగా వస్తేనే అనేకసార్లు ఫిర్యాదు చేయగా.. గతనెల ఏకంగా రూ.16.21 లక్షల బిల్లు రావడం దోపిడీని తెలియజేస్తోంది. బల్దియాలో 48 వార్డులకు కలిపి 72 వాహనాలు నడుస్తున్నాయి. వీటన్నిటికీ కలిపి గతంలో రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు డీజిల్‌ వినియోగం అయ్యేది. గత నెల మాత్రం రూ.16 లక్షలు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాహనాలు అంతే ఉన్నప్పటికీ డీజిల్‌ వినియోగం ఎలా పెరిగిందన్న దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే తప్ప తెలియదు. పాలకవర్గం ఉన్న సమయంలోనే డీజిల్‌ వినియోగంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పలువురు కౌన్సిల్‌లో తరచూ లేవనెత్తారు. కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసిన సంఘటనలున్నాయి. అయినప్పటికీ డీజిల్‌ దోపిడీ ఆగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డీజిల్‌ ఎటు పోతోంది..?

మున్సిపల్‌ వాహనాల్లోనే పోయించాల్సిన డీజిల్‌ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ నుంచే డీజిల్‌ పోయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇప్పటికీ మున్సిపల్‌ డీజిల్‌నే వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో డీజిల్‌ ఎటు పోతుందో..? ఎంత దోపిడి జరుగుతుందో విచారణ చేపడితే తప్పా తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.

‘సాక్షి’ కథనంతో ప్రకంపనలు

‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘డీజిల్‌ కుంభకోణం’ కథనం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ దీనిని సీరియస్‌గా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పలువురు మాజీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో సమావేశమైన అనంతరం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరనున్నట్లు సమాచారం. మున్సిపల్‌ వాహనాల్లో పోయించాల్సిన డీజిల్‌ ఇతరుల వాహనాల్లో వాడితే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిసింది.

కఠిన నిబంధనలు తెస్తేనే..

మున్సిపల్‌ వాహనాల్లో వారానికోసారి డీజిల్‌ పోయిస్తుంటారు. పకడ్బందీగా చేపడితే తప్ప ఇది పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో అప్పటి కమిషనర్‌ స్వరూపరాణి కూపన్‌ సిస్టం తీసుకొచ్చారు. కమిషనర్‌ రాసి ఇచ్చిన కూపన్‌ను వాహనదారులు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఇస్తే ఆయన డీజిల్‌ పోయించేవారు. ఆ విధానం ఇప్పుడు మరుగునపడింది. కంప్యూటర్‌ బిల్స్‌, మాన్యువల్‌ బిల్స్‌తో అక్రమాలకు నిలయంగా మారుతోంది. ప్రతిసారి కౌన్సిల్‌లో డీజిల్‌పైనే చర్చ జరగుతోంది. ప్రతినెల రూ.8 లక్షలు రావాల్సిన బిల్లులు రూ.10 లక్షలు దాటితేనే కౌన్సిలర్లు నిలదీసేవారు. పాలకవర్గం ముగిసిన అనంతరం రూ.16 లక్షలు రావడంతో అనుమానాలకు తావిస్తోంది.

జీపీఎస్‌ సిస్టమ్‌ ఉన్నా లేనట్లే...

మున్సిపల్‌ వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలిసేలా గతంలో జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టం తీసుకొచ్చారు. అది కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఒకవేళ అవి సక్రమంగా పనిచేస్తే వాహనాలు ఎటు వెళ్తున్నాయి..? ఎంత డీజిల్‌ ఖర్చవుతుందన్న విషయాలు బయటపడే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement