
ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం
● అర్హత లేకుండా వైద్యం ● జిల్లాలో అధికారుల ఆకస్మిక తనిఖీలు ● నమోదవుతున్న కేసులు
జగిత్యాల: జిల్లాలో ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నారు. పలు చోట్ల అర్హత లేకుండానే వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అమయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు అందినంత దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. దీనిని గుర్తించిన మెడికల్ కౌన్సిల్ అధికారులు జిల్లా కేంద్రంలో మార్చి 28న ఆకస్మిక దాడులు చేసి నలుగురిపై కేసులు సైతం నమోదు చేశారు. ఇందులో నకిలీ సర్టిఫికెట్లతో చెలామణి అవుతున్నారని గుర్తించారు. వీరిని అరికట్టి కట్టడి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
అర్హత లేకుండా వైద్యంపై సీరియస్
ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు వైద్యం అందించడంపై వైద్యశాఖ సీరియస్‌గా తీసుకుంటోంది. జిల్లాలో అర్హత లేకుండానే డాక్టర్‌గా బోర్డులు పెట్టుకోవడం, ఏకంగా స్టెతస్కోప్ పెట్టుకుని పరిశీలిస్తూ తమ వద్దకు వచ్చిన పేషెంట్స్‌కు ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు, సైలెన్స్ ఎక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారు ఎలాంటి మెడిసిన్ దగ్గర పెట్టుకోకూడదు. కొందరైతే మెడికల్ షాపులనే నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. వారు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కాగా, ఆర్‌ఎంపీల వ్యవస్థ ఇష్టారాజ్యంగా ఉండటంతో వారిపై వైద్యశాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న వీరు తెలంగాణ క్లీనికల్ ఎష్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 2010 ప్రకారం డాక్టర్ బోర్డును పెట్టుకోకూడదు.
కమీషన్ల ఎర...
జిల్లా కేంద్రంలో ఇటీవల మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆస్పత్రులు వెలుస్తున్నాయి. వీరు ఆస్పత్రులు నడవాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలను ఆకట్టుకుంటున్నారు. వారికి గిఫ్ట్‌లు ఇవ్వడంతో పాటు, ఫారెన్ టూర్లకు పంపడం వంటివి చేయడంతో వారు రోగులను కమీషన్ ఇచ్చిన ఆస్పత్రులకు పంపుతూ అందినంత దోచుకుంటున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకులు సైతం వారికి కమీషన్లు ఎరచూపుతూ పేషెంట్స్‌ను తీసుకువచ్చిన అనంతరం ఒక పేషెంట్‌పైనే అత్యధికంగా దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సిఫారసులకు తెరపడేది ఎప్పుడోనని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు ఆర్‌ఎంపీల వ్యవస్థను నిర్వహించేందుకు పీఆర్వోలను పెట్టుకోవడం గమనార్హం.

ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం