నృసింహుని సన్నిధిలో తాగునీటి కొరత
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని శుద్ధజలం ప్లాంట్ నిరుపయోగంగా మారింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు బోరు నీరే దిక్కవుతోంది. ప్లాంట్‌ను ఉపయోగంలోకి తెస్తే రూ.లక్షల ఖర్చును ఆదా చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరేటర్ చెడిపోయి నెల రోజులవుతున్నా.. పట్టించుకోకపోవడంతో అద్దె ప్రాతిపదికన మరో జనరేటర్ తెప్పించారు. దానిని నిత్యం రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఉన్నవాటిని వినియోగంలోకి తెస్తే ఆలయానికి ఖర్చును ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు నీటిశుద్ధి ప్లాంట్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. కొంతకాలానికి ప్లాంటు చెడిపోవడంతో భక్తులకు శుద్ధనీరు కరువైంది. దీంతో దేవస్థానం ముందున్న సంప్‌లోకి ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపి పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యాన్నదానానికి ఫిల్టర్ నీటిని కొనుగోలు చేసే పరిస్థితులున్నాయి. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరందించేందుకు రూ.5లక్షలు మంజూరు చేస్తానని స్వయంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన నివేదికను అధికారులు తయారు చేయకపోవడంతో నిధులు అందకుండా పోయాయి.
భక్తులకు బోరు నీరే దిక్కు
నిరుపయోగంగా శుద్ధజలం ప్లాంటు
నెల రోజులుగా ఇదే పరిస్థితి
ఉపయోగంలోకి తెస్తే రూ.లక్షలు ఆదా
నృసింహుని సన్నిధిలో తాగునీటి కొరత


