ఆడనే అంతం!
● ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు ● గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా ● ఆడపిల్ల అని తెలిస్తే ‘కాలగర్భంలో’ కలిపేస్తున్నారు ● దందాలో ఆర్‌ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర ● స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
కరీంనగర్ 142
‘ఈ చిత్రంలో వైద్యాధికారులు సీజ్ చేస్తున్న ఆస్పత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోనిది. నిబంధనల ప్రకారం స్కానింగ్ చేసినవారి వివరాలను రెండేళ్ల పాటు భద్రంగా ఉంచటంతో పాటు, ప్రతినెలా తమ ఆస్పత్రిలో జరిగే స్కానింగ్, తదితర వివరాలు జిల్లావైద్యారోగ్యశాఖకు సమర్పించాలి. కానీ, ఈ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో తనిఖీ చేయగా స్కానింగ్ యంత్రంలోని హార్డ్‌డిస్క్‌ను మాయం చేయడంతో పాటు, రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశారు’.
ఉమ్మడి జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు
పెద్దపల్లి 31
జగిత్యాల 78
సిరిసిల్ల 35
లింగ నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి)
జిల్లా లింగనిష్పత్తి (0–6 వయసు
చిన్నారుల్లో)
జగిత్యాల 992 947
పెద్దపల్లి 992 922
కరీంనగర్ 993 931
సిరిసిల్ల 1,014 942
‘జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో అనుమతి లేని స్కానింగ్ యంత్రాలు మూడు ఉండగా నాలుగునెలల క్రితం వాటిని వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్తించి సీజ్ చేశారు’.
‘ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు కరీంనగర్‌లో తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక సెంటర్‌లో మొబైల్ స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేశారు. అయినా తెరవెనుక దందా దర్జాగా నడుస్తోంది’.
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్/జగిత్యాల:
కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే బిడ్డను కరిగించేస్తున్నారు. లింగనిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ఆర్‌ఎంపీలతో కలిసి ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. దీంతో లింగనిష్పత్తిలో అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా 0–6 వయస్సు చిన్నారుల్లో పెరుగుతున్న అంతరం ఆందోళన కలిగిస్తుంది.
ఆర్‌ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర
పల్లెలు, పట్టణాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఉమ్మడి జిల్లాలో లింగనిర్ధారణ దందా సాగుతోంది. కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముఠాగా ఏర్పడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదర్చుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లకు మహిళలను పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది.
రెండు, మూడో కాన్పుపై దృష్టి సారిస్తే..
మొదటి కాన్పులో ఆడపిల్లలు పుట్టినవారికి రెండు, మూడోసారి గర్భం దాల్చిన మహిళలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. 12 వారాల గర్భం కలిగిన మహిళలు తమ వివరాలను వైద్య పరీక్షల కోసం ఏఎన్‌ఎం వద్ద నమోదు చేసుకుంటారు. తర్వాత 16 నుంచి 20 వారాల్లో మరోసారి వారు వైద్యపరీక్షలకు వచ్చినప్పుడు రికార్డు చేస్తారు. అలాంటి సమయంలో వారు రాకుంటే నిఘా పెట్టి గర్భంతో ఉన్నారా.. లేక అబార్షన్ చేయించుకున్నారనేది తెలుసుకుని విచారణ చేపడితే ఈ దందాకు చెక్ పెట్టవచ్చు.
చట్టం ఏం చెబుతుందంటే..
లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రభుత్వాలు 1994లో తీసుకొచ్చాయి. కడపులోని పిండం ఎదుగుదలను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ కేంద్రాలను నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి ఐదేళ్ల జైలు, రూ.50వేల జరి మానా చెల్లించాలి. నేరం నిర్ధారణ అయితే వైద్యవృత్తి నిర్వహణ అర్హత కోల్పోతారు.
ఆపరేషన్ డెకాయ్ ఎక్కడ?
గతంలో ఆస్పత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యాధికారులు డెకాయ్ ఆపరేషన్ల పేరిట తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుతం అవి అమలు కావడం లేదు. డెకాయ్ ఆపరేషన్‌లో మహిళ తహసీల్దార్, మహిళా ఎస్సై, సఖీ సెంటర్ నిర్వాహకులు ఉంటారు. వైద్యాధికారులే ఈ బృందాన్ని స్కానింగ్ సెంటర్లకు గర్భిణుల వలే పంపిస్తారు. లింగనిర్ధారణ చేసేందుకు డబ్బు ఎర వేస్తారు. ఎవరైనా పరీక్షలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లాలో డెకాయ్ ఆపరేషన్లు ఎక్కడా కన్పించడం లేదు.
కోడ్ భాషలోనే..
కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ తెరవెనుక వేరే ఉంటుంది. లింగనిర్ధారణ చేసి పుట్టబోయేది ఎవరనేది కోడ్‌భాషలో చెబుతారు. కేషీట్లపై కోడ్ భాషలో మైనస్, ప్లస్ గుర్తులు పెడుతున్నట్లు సమాచారం.
ఆడనే అంతం!
ఆడనే అంతం!
ఆడనే అంతం!


