
స్కిజోఫ్రీనియా ఓ మానసిక వ్యాధి
జగిత్యాలటౌన్: స్కిజోఫ్రీనియా ఓ మానసిక వ్యాధి అని, ఈ వ్యాధికి గురైనవారు అపనమ్మకాలు, హాల్యునేషన్‌కు గురై సమాజానికి దూరంగా ఉంటూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారని, నివారణకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో అధునాతన వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు పేర్కొన్నారు. ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రిలో సైకియాట్రిక్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాములు మాట్లాడుతూ.. మెదడులో జరిగే కొన్ని రసాయన చర్యలతో పాటు జన్యుపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఈ జబ్బు సోకుతుందన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించకపోతే తీవ్రత పెరిగి ఆహారం తీసుకోకపోవడం, ఉన్మాదులుగా మారడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం లాంటివి జరుగుతాయని అన్నారు. స్కిజోఫ్రినియా నివారణకు యాంటిసైకోటిక్స్ లాంటి మందులు అందించవచ్చని తెలిపారు. సైకియాట్రిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ విశాల్, ఆర్‌ఎంవో నవీన్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీధర్, సాకేత్, వరుణ్ పాల్గొన్నారు.