
అసంపూర్తిగా మిగిలిన మెట్లదారిలో నడవలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధ భక్తులు
కొండగట్టు(చొప్పదండి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో వచ్చే ఏప్రిల్ 6న హనుమాన్ చినజయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలివస్తారు. అయితే, గడువు సమీపిస్తున్నా ఆలయ అధికారులు ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభించడంలేదు. ప్రధానంగా మాలవిరమణ చేసే మండపం, మెట్లదారి పునాదులు దాటడంలేదు. ఫలితంగా ఏళ్లుగా మాలధారులు, దీక్షస్వాములు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్సవాలకు లక్షల మంది దీక్షాస్వాములు
● ఉత్తర, దక్షిణ తెలంగాణకు చెందిన లక్షల మంది హనుమాన్ దీక్షా స్వాములు మాల విరమణ చేయడానికి కొండగట్టుకు తరలి వస్తారు.
● ఏటా అసౌకర్యాల మధ్యే వారు మాల విరమణ చేసుకుంటున్నారు.
● ఈసారైనా మాల విరమణకు మండపం అందుబాటులోకి వస్తుందని ఆశించినా ఇంకా ఆ పనులే ప్రారంభం కాలేదు.
రూ.2.5కోట్లతో పనులు..
● 11, 21, 41 రోజుల పాటు దీక్ష చేపట్టిన స్వాములు.. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధికి తరలివిచ్చి మాల విరమణ చేస్తారు. వీరికోసం రూ.2.50కోట్ల వ్యయంతో ఓ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. కారణం తెలియదు కానీ, మధ్యలోనే పనులు ఆపేడంతో అధికారుల చొరవతో ఇటీవల మళ్లీ ప్రారంభించారు. కొద్దిరోజులకే అవి మళ్లీ ఆగిపోయాయి. ఫలితంగా కల్యాణ కట్టలో మాలవిరమణ చేస్తూ భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు.
ప్రారంభంకాని మెట్లదారి పనులు..
● కాలినడక మొక్కుతో కొండపైకి వచ్చే భక్తుల కోసం గుట్ట దిగువనుంచి ఘాట్‌రోడ్డు టటటటసమీపంలో సుమారు 1.5 కిలో మీటర్ల దూరం వరకు మెట్లదారి ఉంటుంది. దాని పునరుద్ధరణకు రూ.2.5కోట్లతో టెండర్ పూర్తిచేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంకా నిర్మాణం ప్రారంభించలేదు.
బాధగా ఉంది
ఈసారి 21రోజుల మాలధారణ చేశా. మాల విరమణ కోసం కొండపై మండపం నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏళ్లుగడిచినా కార్యరూపం దాల్చడంలేదు. అధికారుల తీరు బాధగా ఉంది.
–వెంకట్, హన్మాన్ దీక్షాపరుడు, హైదరాబాద్

పునాదుల్లోనే నిలిచిన మాలవిరమణ మండపం
