
నాలుగేళ్లు శ్రమిస్తే.. ముప్పై ఏళ్లు దిగుబడి
● ఆయిల్‌పాం సాగువైపు రైతుల మొగ్గు ● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ బాధ్యత కంపెనీదే ● ఈ సారి 3వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
కరీంనగర్‌అర్బన్: ఇష్టారీతిగా మందుల పిచికారీ, ఎరువుల వాడకంతో సాగు నేలలు గుల్లబారుతున్నాయి. పంట దిగుబడులు తగ్గుతుండగా పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో అన్నదాతకు అధిక ఆదాయన్నిచ్చే ఆయిల్‌పాం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లు శ్రమిస్తే 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుండగా మందుల పిచికారీ, ఎరువుల వాడకం ఉండదు. జిల్లాలో గత రెండేళ్లలో 2,500 ఎకరాల వరకు సాగు చేయగా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మానకొండూరు మండలం వేగురుపల్లిలో ముత్తారెడ్డి పంట దిగుబడి పొందుతుండగా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యా న, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు లోహి యా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు.
3వేల ఎకరాలు లక్ష్యం
జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 12,000 ఎకరాల్లో ఆయిల్‌పాంను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై నుంచి జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని అధికారులు చెబుతున్నారు.
సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు
● ఆయిల్‌పాం సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
● మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్ పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్‌పాం మొక్కలను 80 శాతం సబ్సిడీపై రూ.1,140 రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలు ప్రభుత్వం అందిస్తుంది.
● నాలుగేళ్లు పంట నిర్వహణకు ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. ఇక వచ్చిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
● ప్రస్తుతం మానకొండూరు మండలం అన్నారంలో కేంద్రం ఏర్పాటు చేయగా డైరెక్టర్ ఆఫ్ హర్టికల్చర్ నిర్ణయించిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయనుండగా దళారీ వ్యవస్థ అసలే ఉండదు.
● పంట చేతికొచ్చే నాలుగేళ్లలో అంతర పంటలుగా మొక్కజొన్న, పత్తి, పెసర, మినుములు, బొబ్బర, వేరుశనగ మొదలగు పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.