
రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం
ధర్మపురి: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం పాలైన ఘటన ధర్మపురిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వొడ్నాల భూమేశ్ అలియాస్ భూమేశ్వర్ భార్య బింధు కరీంనగర్‌లో టీటీసీ చేస్తోంది. ధర్మారం డిగ్రీ కళాశాలలో ప్రైవేటు అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బింధు ప్రతిరోజూ కరీంనగర్ వెళ్లడానికి ఉదయం బస్టాండ్‌కు వస్తుంది. జగిత్యాల మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఎప్పటిలాగే బుధవారం కూడా భర్త భూమేశ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బస్టాండ్‌కు వచ్చింది. అప్పుడే బస్సు వెళ్లిందని తెలుసుకున్న భూమేశ్ బస్సును అందుకునేందుకు జగిత్యాల వైపు బయల్దేరాడు. పట్టణ శివారులోని పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే రాంగ్‌రూట్‌లో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. భూమేశ్ (43) తలకు బలమైన గాయాలయ్యాయి. బింధు కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఇద్దరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. భూమేశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. భూమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. టాటా ఏస్ వాహనం నడిపింది మైనర్ అని, అతడిది తీగళధర్మారమని పోలీసులు గుర్తించారు. భూమేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. భూమేశ్ మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.