
భూసేకరణ పరిహారం ఫైళ్లు మాయం
సిరిసిల్ల: జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి. జిల్లాలో భారీ, మధ్యతరహా జలాశయాల నిర్మాణాలు, కాల్వలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాభూములను సేకరించారు. ప్రజాప్రయోజనార్థం ప్రజల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులు(ఫైళ్లు) జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద కనిపించడం లేదు. గతంలో జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడంపై జిల్లా అధికారులు అయోమయానికి గురయ్యారు. గతంలో జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ రికార్డులను మాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మధ్యమానేరు జలాశయానికి సంబంధించి అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్‌డీసీ) నటరాజ్ ఫైళ్లు మాయం చేశారని అతనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. అతని వద్ద ఫైళ్ల రికవరీకి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత జిల్లాలో మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు–9, 8, 7, 6, 5లకు సంబంధించిన భూసేకరణలు భారీ ఎత్తున జరిగాయి. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వానికి నివేదిక.. కేసు నమోదుకు అవకాశం
సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూసేకరణ ఫైళ్లు కనిపించడం లేదు. ఆ రెండు ఆఫీస్‌ల్లో పూర్తి స్థాయిలో వెదికిన అధికారులు రికార్డులు లేవని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు రికార్డులను మాయం చేసిన గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎన్ని ఫైళ్లు మాయమయ్యాయి.. ఎంత మేరకు పరిహారం చెల్లించారు.. ఎన్ని ఎకరాలకు చెల్లించారు.. ఎందుకు రికార్డులు మాయం చేశారు అనే అంశాలను బయటకు రాకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజన్నసిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ఫైళ్ల మాయం రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదై, పూర్తి స్థాయి విచారణ జరిగితే భూసేకరణలో జరిగిన అక్రమాలన్నీ బయటపడనున్నాయి. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారి పూర్తి స్థాయిలో వివరాలను క్రోఢీకరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం విశేషం.
అధికారుల అయోమయం
జిల్లాలో పనిచేసిన అధికారిపై కేసు నమోదుకు సిఫార్సు