
చదవనిద్దాం.. ఎదగనిద్దాం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థి దశలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత వేసే అడుగే కీలకం. ఇంటర్‌లో సరైన అడుగు పడితేనే జీవితంలో త్వరగా స్థిరపడతాం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల ఆసక్తిని తెలుసుకొని ప్రొత్సహించినప్పుడే భవిష్యత్‌లో రాణించగలుగుతారు. ఈ సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టమైన కోర్సులను పిల్లలపై బలవంతంగా రద్దువద్దని కోరుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు, 31 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 14 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.
అడ్మిషన్.. ఆలోచించాల్సిన సమయం
పదోతరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలో 12,245 మంది, రాజన్నసిరిసిల్లలో 6,629, పెద్దపల్లిలో 7,157, జగిత్యాలలో 11,636 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరంతా ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సిద్ధమవగా.. మరికొందరు హైదరాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు పాలీసెట్ రాసి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అత్తెసరు మార్కులతో పాసైన వారు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకోవడం ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏం చదువాలో అనే నిర్ణయం విద్యార్థులకు వదిలేయాలని, సలహాలు.. సూచనలు మాత్రమే ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
పదోతరగతి ఉత్తీర్ణులు
కరీంనగర్ 12,245
రాజన్నసిరిసిల్ల 6,629
పెద్దపల్లి 7,157
జగిత్యాల 11,636