జగిత్యాల: మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరమని సీడీపీవో వీరలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక క్రీడా కార్యాలయంలో అంగన్‌వాడీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నేరంగా పరిగణిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ టీచర్లు తమ పరిధిలోని అన్నివర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెంచుకుని అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ బలరాంకృష్ణ మాట్లాడుతూ, ప్రజ్వల సంస్థ 27ఏళ్లుగా డాక్టర్ సునీత కృష్ణ ఆధ్వర్యంలో ఐసీడీఎస్, పోలీస్, జ్యుడీషియల్ సహకారంతో 26,500 మంది అమ్మాయిలను కాపాడి, పునరావాసం కల్పించిందన్నారు. యువత ఇంటర్నెట్, మొబైల్ ద్వారా సైబర్ ట్రాకింగ్‌కు గురవుతోందని, ఈవిషయంపైనా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కో ఆర్డినేటర్లు శ్రావ్య, శృతి పాల్గొన్నారు.