
సమావేశమైన ఉద్యోగులు (ఫైల్)
● పే స్కేల్ అమలు చేస్తూ జీవో జారీ
● జిల్లాలో 102 మంది
ఉద్యోగులకు మేలు
కథలాపూర్(వేములవాడ)/పెగడపల్లి(ధర్మపురి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. గతేడాది అసెంబ్లీలోనే ప్రభుత్వం పేస్కేల్ అమలు చే స్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీవో నంబర్ 11 జారీచేసింది. దీంతో జిల్లాలో 102 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది.
2002లో నియామకం..
● కేంద్ర ప్రభుత్వ పథకమైన డీఆర్డీవోలో సెర్ప్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.
● ఇందులో పనిచేసేందుకు 2002, 2003 సంవత్సరంలో హెచ్‌ఆర్ పాలసీ కింద ఉద్యోగులను భర్తీచేశారు.
● వీరిని ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసేవారు.
● ఇప్పటివరకు సెర్ప్ ఉద్యోగులకు ఎలాంటి క్యాడర్, పేస్కేల్ అమలు చేయలేదు.
● కాంట్రాక్ట్ పద్ధతిన కొంత వేతనం చెల్లిస్తూ వచ్చారు.
వచ్చే నెల ఒకటి నుంచి అమలు
జిల్లాలోని ఆయా మండలాలు, జిల్లా కేంద్రంలో సెర్ప్‌లో వివిధ హోదాల్లో 102 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు పేస్కేల్ అమలు లేక, ఏ క్యాడర్‌లో పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో నెట్టుకొచ్చారు. ప్రభుత్వం శనివారం ప్రకటించిన ప్రకారం.. క్యాడర్ ఫిక్స్ కావడంతో వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పేస్కేల్ వర్తించడం, వేతనాలు పొందనున్నారు. సెర్ప్ ఉద్యోగులకు కనిష్ట పేస్కేల్ రూ.19వేల – రూ.58,850 కాగా, గరిష్ట వేతనం రూ. 51,320 – రూ.1,27,310గా నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పేస్కేల్ అమలు చేయనున్నారు.