అమెరికాలో హింసాత్మకం.. ట్రంప్‌ తీరుపై ఆగ్రహం

World leaders condemn Trump supporters storm Capitol - Sakshi

క్యాపిటల్‌ భవనంలో జరిగిన ఘర్షణలో నలుగురు మృతి

ఘటనను ఖండించిన ప్రధాని మోదీ, ప్రపంచ దేశాల అధినేతలు

రాజీనామా యోచనలో డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది. యూఎస్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఊహించని రీతిలో ఓటమి పాలైన రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన వెర్రి చేష్టలతో అధికార మార్పిడికి మోకాలొడ్డుతున్నారు. అధికారదాహంతో ఊగిపోతూ‌.. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తన మద్దతుదారులను ఉసిగొల్పుతున్నారు.  ఒకప్పుడు శాంతికి చిహ్నంగా నిలిచిన శ్వేతజాతీయులు నడిరోడ్డుపై నిరసనలకు దిగుతున్నారు. బైడెన్‌ గెలుపును అధికారికంగా ధృవీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్‌ సభ హింసాత్మకంగా మారింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్‌ డిసీలోని క్యాపిటల్‌ భవన్‌ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. (వాషింగ్టన్‌ డీసీలో తీవ్ర ఉద్రిక్తత)

ప్రపంచ దేశాల ఉలిక్కిపాటు
అందోళకారులు శాంతించాలంటూ డొనాల్డ్‌ ట్రంప్‌  ఓ వీడియోను విడుదల చేసినా.. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ట్రంప్‌ మద్దతు దారులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు మరోముగ్గురు మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత టియర్‌ గ్యాస్‌ ప్రయోగించగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన యావత్‌ ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా చెప్పుకునే అమెరికాలో అధికార మార్పిడి హింసాత్మకంగా మారడంలో ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్‌ ముందు జరిగిన ఘర్షణపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాన బోరిస్‌ జాన్స్‌న్‌, కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంలో అధికార మార్పడిన శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పెద్దన్నగా వర్ణించే యూఎస్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం. నిరసనకారులను శాంతిపచేయాల్సిన బాధ్యత వారి నేతలకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి ఆమోద యోగ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. (క్యాపిటల్‌ భవనంపై దాడి: ట్రంప్‌కు బైడెన్‌ విజ్ఞప్తి‌)


ఫలితాల తారుమారుకు ట్రంప్‌ ఒత్తిడి...
మరోవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఏడాది నవంబర్‌ 3న జరగిన ఎన్నికల్లో 306- 232 తేడాతో ట్రంప్‌ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న ట్రంప్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలను సవాలు చేస్తూ రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన దాదాపు 60 పిటిషన్లను అక్కడి కోర్టులు కొట్టివేశాయి. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఎక్కడా కనిపించడంలేదని న్యాయస్థానాలు తేల్చిచెబుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఈ క్రమంలో.. స్వింగ్‌ స్టేట్‌ అయిన జార్జియా ఎన్నికల చీఫ్‌కు ఆయన చేసిన ఫోన్‌ కాల్‌ ఆడియో లీకవ్వగా అది ఎంతి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా బైడెన్‌ గెలుపును పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించే ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను సైతం ట్రంప్‌ ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. ఫలితాలను తారుమారు చేయాలన్న ట్రంప్‌ విజ్ఞప్తిని మైక్‌ తీవ్రంగా తోసిపుచ్చారు.

రాజీనామా చేసే యోచనలో ట్రంప్‌..
ఇక క్యాపిటల్‌ భవన్‌ ముందు చెలరేసిన హింసపై జో బైడెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని అంగీకరించలేకనే ట్రంప్‌ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు అంటూ మండిపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేస్తూ ట్విటర్‌ యాజమన్యం నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ ఖాతాను 12 గంటలపాటు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లు తొలగించాలని తొలుత ట్రంప్‌ను కోరగా.. ఆయన స్పందించకపోవడంతో ట్వీట్లు తొలగించి అన్‌లాక్‌ చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తుండటంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన వ్యక్తిగత సలహాదారులతో ట్రంప్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా జనవరిన అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కొరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top