భారత్‌ పేరుతో అమెరికా కొత్తనాటకం | US links hormuz freedom to indias lpg needs | Sakshi
Sakshi News home page

భారత్‌ పేరుతో అమెరికా కొత్తనాటకం

May 5 2026 8:08 PM | Updated on Jun 18 2026 1:10 PM

US links hormuz freedom to indias lpg needs

అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ‍ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్‌ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. 

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్  ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం"  అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.

గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.

చైనాపై ఆరోపణలు
కాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్‌ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది.  ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

ఇరాన్‌ దగ్గర సత్తా లేదు
యుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు.  వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement