ఉక్రెయిన్‌కు కీలక ప్రాంతం.. ఆ కారణంతోనే రష్యా బలగాలు వెనక్కి?

Ukraine Crisis: Snake Island Curse reason Russia Back Forces - Sakshi

ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన ప్రాంతం అది. పైగా.. ఉక్రెయిన్‌ కీలక ఆర్థిక ప్రాంతమైన ఒడెస్సా పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలోపే ఉంది. బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టేందుకు వీలుండటం ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకతలు. మరి అలాంటి ప్రాంతం నుంచి రష్యా ఎందుకు వెనక్కి వెళ్లింది?..

స్నేక్‌ ఐల్యాండ్‌.. ఉక్రెయిన్‌కు చెందిన ఈ ద్వీపం చాలా చిన్నదే. కానీ, చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ప్రాంతానికి. ఈ దీవి కోసం ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు.. అందునా 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 1788 జూలైలో రష్యాకు, టర్కీ చక్రవర్తికి మధ్య ఈ ద్వీపం కోసం యుద్ధాలు జరిగాయి. అందులో రష్యా గెలిచి ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత కూడా యుద్ధాలలో రష్యాకు, టర్కీకి మధ్య మారుతూ వచ్చింది. కొన్నేళ్లపాటు రొమేనియా ఆధీనంలోకి వెళ్లింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ద్వీపంపై టర్కీ దాడి చేయగా.. రెండో ప్రపంచ యద్ధంలో సోవియట్‌ యూనియన్, రొమేనియాల మధ్య యుద్ధం జరిగింది. 1944లో ఈ ద్వీపం సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఉక్రెయిన్ చేతిలోకి వచ్చింది.

కారణం అదేనా.. 
పురాణాల ప్రకారం స్నేక్ ఐలాండ్ గ్రీకు వీరుడు, దేవుడిగా పూజించే అకిలెస్ సమాధి స్థలం అనే ప్రచారం ఉంది. అక్కడ ఒక ఆలయం కూడా ఉండేది. 1788లో రష్యా, టర్కీల మధ్య యుద్ధంలో, ఆ తర్వాతి యుద్దాల సమయంలో, రొమేనియా దాడి చేసినప్పుడు.. ఇలా ప్రతిసారి ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న దేశాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ద్వీపానికి శాపం ఉందేమోనన్న ప్రచారమూ ఉంది.

ఇప్పుడు కూడా స్నేక్ ఐలాండ్ పై దాడి చేసి బాంబులు కురిపించిన రష్యాకు చెందిన కీలకమైన మాస్కోవా యద్ధ నౌక కొద్దిరోజుల్లోనే దెబ్బతిని మునిగిపోయింది. దీని సమీపంలోనే రష్యాకు చెందిన ఇతర నౌకలూ దెబ్బతిన్నాయి. ఒక విమానంకూడా కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్యా బలగాలు వెనక్కి వెళ్లాయని భావిస్తున్నారు. అయితే రష్యా మాత్రం.. మానవతా కోణంలో ఆహార పదార్థాల రవాణాకు మార్గం సుగమం చేయాలన్న  ఐరాస పిలుపునకు స్పందించే వైదొలిగామంటూ ప్రకటించుకుంది. ఈ మేరకు జూన్‌ 30వ తేదీన బలగాలను వెనక్కి పిలిపించుకుంది.

అర కిలోమీటరు పొడవు, అంతకన్నా తక్కువ వెడల్పుతో నల్ల సముద్రంలో కొలువై ఉంది స్నేక్ ఐలాండ్. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక.. ముందుగా స్నేక్ ఐలాండ్ పైనే దాడి చేసి స్వాధీనం చేసుకున్నాయి రష్యా బలగాలు. అయితే రష్యా బలగాల నిష్క్రమణతో..  తాజాగా ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. స్నేక్ ఐలాండ్ లో సైనిక చర్య పూర్తయిందని, రష్యా దళాలను తరిమికొట్టి ఆ భూభాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించుకుని తిరిగి ఉక్రెయిన్ జెండాను ఎగురవేసింది సైన్యం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top