స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఎదురుదెబ్బ
అనూహ్యంగా పుంజుకున్న రిఫార్మ్ యూకే పార్టీ
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఊహించని షాక్‌కు గురైంది. తాజాగా జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంగ్లండ్‌లోని వెయ్యి సీట్లు సహా మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 1,400కుపైగా స్థానాలను కోల్పోయింది. అనూహ్యంగా రిఫార్మ్ యూకే తెరపైకి వచి్చంది. సీనియర్ రాజకీయ నేత నిగెల్ ఫరేజ్ సారథ్యంలోని వలస వ్యతిరేక అజెండా కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు 1,440 కౌన్సిల్ స్థానాలకు గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్‌పై అసమ్మతి స్వరం మరింతగా పెరిగింది. ఆయన పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ ఊపందుకుంది.
ప్రధాని కియర్ స్టార్మర్ పాలనపై అనధికారిక ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన పార్టీని అధికారం దిశగా నడిపించిన స్టార్మర్ ప్రజాదరణ ఆ తర్వాత వేగంగా తగ్గిపోతూ వచి్చంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆయన పదవికి ఇప్పటికిప్పుడు వచి్చన ముప్పేమీ లేదని విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆర్థిక పురోగతి మందగించడం, సంక్షేమ వ్యయం తగ్గించడం వంటివి లేబర్ పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. లేబర్ పార్టీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో దెబ్బతింది.
అధికార లేబర్ పార్టీకి 50 ఏళ్లుగా కంచుకోటలుగా ఉన్న సుండర్‌లాండ్, బార్న్‌స్లే వంటి చోట్ల రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేసింది. కన్జర్వేటివ్‌లకు మంచిపట్టున్న న్యూకాజిల్–అండర్–లైమ్, సఫోక్, ఎస్సెక్స్ ప్రాంతాలు కూడా ఈ పార్టీ వశమయ్యాయి. ఎసెక్స్ నుంచే అరడజను మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీకి సంప్రదాయబద్ధంగా పట్టున్న ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ ఓట్లను చీల్చడం, నేరుగా గెలవడం ద్వారా ప్రభావాన్ని చాటుకుంది. ఇంతేకాదు, మొట్ట మొదటిసారిగా లండన్ పరిధిలో ఉన్న హవెరింగ్‌నూ రిఫార్మ్ యూకే పార్టీ గెల్చుకుంది.
వేల్స్‌లో 27 ఏళ్ల తర్వాత ఓటమి
అధికార లేబర్ పార్టీ వేల్స్‌లో 27 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. వేల్స్ జాతీయ పార్లమెంట్(సెనెడ్)లో ప్లాయిడ్ కమ్రీ పార్టీ ఘన విజయం సాధించింది. సెనేడ్‌లోని 96 స్థానాలకు గాను ప్లాయిడ్ కమ్రీ 43 సీట్లను గెల్చుకుంది. అయితే, మెజారిటీకి కొద్దిదూరంలో నిలిచింది. ఇక్కడా రిఫార్మ్ యూకే పార్టీ దూకుడు కొనసాగింది. ఎవరూ ఊహించని రీతిలో సెనేడ్‌లో ఈ పార్టీ 34 సీట్లు కైవసం చేసుకోగా లేబర్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది.
లేబర్ ఫస్ట్ మినిస్టర్‌గా ఉన్న ఎల్యునెడ్ మోర్గాన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటిదాకా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 22 మంది సభ్యులుండగా, తాజాగా ఏడుగురు మాత్రమే విజయతీరాలకు చేరారు. ఇంగ్లండ్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే లండన్‌లో మాత్రం లేబర్ మంచి ఫలితాలనే సాధించుకుంది. ప్రధాని స్టార్మర్ సొంత నియోజకవర్గం లండన్‌లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌కు పొరుగునున్న కామ్డెన్‌లో 16 సీట్లను కోల్పోయినప్పటికీ లేబర్ పార్టీ పట్టునిలుపుకుంది. ఇక్కడ గ్రీన్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఈ ఫలితాలు స్టార్మర్‌కు కొంత ఊరట కలిగించాయని చెప్పవచ్చు.
పదవి నుంచి వైదొలగను: స్టార్మర్
ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలంటూ వెలుపలి నుంచి విని్పస్తున్న డిమాండ్లపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో నేను పదవి నుంచి తప్పుకోను. దేశాన్ని అస్థిరతలోకి నెట్టివేయబోను’అని స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనవసరమైన కొన్ని తప్పిదాలు చేసిందని, మొదటి రెండేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని అంగీకరించారు. మంత్రివర్గ సహచరులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎవ్వరూ వ్యతిరేక గళం వినిపించలేదు. గట్టి పోటీదారులుగా భావించే లేబర్ పార్టీ నేతలెవరూ ఆయన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో స్టార్మర్ తర్వాతి స్థానంలో ఉండే అండీ బర్న్ హామ్, ఏంజెలా రేనర్ వంటి వారు సైతం మౌనంగా ఉన్నారు.
స్కాట్లాండ్‌లో ఎస్‌ఎన్‌పీకి ఆధిక్యం
స్కాట్లాండ్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్‌ఎన్‌పీ) వరుసగా ఐదోసారి విజయం సాధించింది. అయితే, పూర్తి మెజారిటీ సాధనలో వెనుకబడిపోయింది. మొత్తం 129 సీట్లకుగాను ఎస్‌ఎన్‌పీ 58 స్థానాలను మాత్రమే సాధించింది. ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పెర్త్‌షైర్ నార్త్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయన ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రిఫార్మ్ పార్టీ కూడా లేబర్ పార్టీతో సమానంగా 17 సీట్లు గెల్చుకోగా, గ్రీన్స్ పార్టీకి 15 సీట్లు దక్కాయి. స్వతంత్ర స్కాట్లాండ్ నినాదానికి మద్దతిచ్చే పార్టీ కావడంతో ఎస్‌ఎన్‌పీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్‌ను బ్రిటన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చడం ఎస్‌ఎన్‌పీ ప్రధాన అజెండా. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం వల్ల రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కష్టం కానుంది.


