అంతరిక్షానికీ ఫుడ్‌ డెలివరీ.. 

Uber Eats Makes Its First Food Delivery To Space - Sakshi

మొదటిసారి ఐఎస్‌ఎస్‌కు డెలివరీ 

ఇంతకుముందు ఆకలైతే వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండుకోవడమో.. లేక వండినది రెడీగా ఉంటే అది తినడమో చేసేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆకలైతే మొబైల్‌ ఫోన్‌ తీసుకొని నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేస్తాం. 30 నిమిషాల్లో వేడివేడి ఆహారం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ రోజుల్లో నగరంలోనైనా.. మారుమూల ప్రాంతమైనా ఇలా ఫుడ్‌ డెలివరీ అవుతోంది. ఈ టెక్‌ యుగంలో ఇలాంటిది రోజూ మనకు అనుభవమే. అయితే, భూమ్మీదనే కాదు అంతరిక్షానికీ ఫుడ్‌ డెలివరీ అవుతోంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఎలాగో తెలుసుకుందాం..! 

భూమ్మీదనే డెలివరీ చేయాలా? అంతరిక్షానికి డెలివరీ చేయకూడదా అని జపాన్‌లోని ఉబర్‌ ఈట్స్‌ కంపెనీ ఆలోచన చేసింది. అనుకున్నదే తడవు గా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉండే వ్యోమగాములకు మొదటిసారి ఫుడ్‌ డెలివరీ చేసింది. అయితే, దీనికోసం సాధారణ డెలివరీ బాయ్‌ వెళ్లలేదు. ఏకంగా జపాన్‌ వ్యాపార దిగ్గజం, బిలియనీర్‌ యుసాకు మేజవాను కంపెనీ రంగంలోకి దింపింది.

ఆయన టీషర్ట్, టోపీ ధరించి డెలివరీ బాయ్‌ వేషంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వ్యోమగాములు ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. గోధుమ రంగులో ప్యాక్‌ చేసిన ఆహారాన్ని ఐఎస్‌ఎస్‌ కమాండర్‌ ఆంటోన్‌ స్కప్లెరోవ్‌ చేతికందించారు. అంతరిక్షంలోకి కూడా ఆహారాన్ని డెలివరీ చేసినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. 

మేజవా స్కప్లెరోవ్‌ జపాన్‌ వంటకాలతో సోయుజ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి నుంచి అంతరిక్షానికి ఎగిరారు. 8 గంటల 34 నిమిషాలపాటు 248 మైళ్ల దూరం ప్రయాణించి ఐఎస్‌ఎస్‌ చేరుకున్నారు. అయితే, డెలివరీకి 30 నిమిషాలు ఆలస్యమైంది అని అన్నారాయన. ఇంతకీ ఆయన తీసుకెళ్లిన పార్సిల్‌లో ఏమున్నాయంటే.. చికెన్, బాంబూ షూట్స్, జపనీస్‌ బీఫ్‌ బౌల్, సబా మిసోని, ఇతర జపాన్‌ వంటకాలు. మేజవా 12 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు.

ఫుడ్‌ డెలివరీ చేశారు కదా ఆయనకు అక్కడేం పని అనుకుంటున్నారా? ఆయనకు అంతరిక్ష యాత్ర చేయడమంటే మహా సరదాలెండి. తనకు మొదటి ఫుడ్‌ డెలివరీ బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆయన సోమవారం అంతరిక్షం నుంచి భూమ్మీదకు సురక్షితంగా చేరారు. 
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top