యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జైళ్లలో మగ్గుతున్న 900 మందికి పైగా భారత ఖైదీల విడుదలకు రంగం సిద్దమైంది. జైళ్ల నుంచి విడుదల కానున్న ఖైదీల జాబితాను యూఏఈ అధికారులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గతేడాది డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఇతిహాద్) పురస్కరించుకుని మొత్తం 2,937 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు.
ఈ 2,937 మందిలో 900 మందికి పైగా భారతీయులు ఉండటం విశేషం. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్షమాభిక్ష మేరకే ఇప్పుడు వందలాది మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. కాగా ఈ విడుదల ప్రక్రియలో యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శిక్షలో భాగంగా ఖైదీలకు విధించిన జరిమానాలు, పరిహార చెల్లింపులను కూడా ప్రభుత్వమే భరించనుంది.
ఈ నిర్ణయం యూఏఈ నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుందని, వారి కుటుంబ సభ్యులపై పడే భారం, బాధ్యతలు తగ్గుతాయని యూఏఈ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా యూఏఈ, భారత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవలే అధ్యక్షుడు నహ్యాన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.


