ట్రంప్‌కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా..

Republican Leaders Challenge Donald Trump In US President Elections - Sakshi

ఒకప్పుడు అందరూ ట్రంప్‌కి వీరవిధేయులు

ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా ఆయనకే సవాల్‌ విసురుతున్నారు

ట్రంప్‌ ఓటమిపాలైనప్పుడు ఆయన వెన్నంటి నడిచిన వారు 

కేపిటల్‌ హిల్‌పై దాడి జరిపినప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్నవారు 

ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు

రిపబ్లిక్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీలో ట్రంప్‌ సన్నిహితులే సై అంటున్నారు.

అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్‌ పారీ్టలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పారీ్టలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచి్చనవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్‌ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెసాంటిస్‌ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి.   

రాన్‌ డెసాంటిస్‌ 
ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెసాంటిస్‌ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్‌ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్‌ నెగ్గారు. 44 ఏళ్ల వయసున్న రాన్‌ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

రాన్‌ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్‌ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్‌ అభ్యర్థిత్వాన్ని ట్రంప్‌ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్‌్కలు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్‌ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్‌ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. 

నిక్కీ హేలీ 
భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్‌ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ.  ఒకప్పుడు రిపబ్లికన్‌ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచి్చంది. పంజాబ్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. 

మైక్‌ పాంపియో  
డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్‌ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్‌ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్‌ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. ‘‘చరిత్ర మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది’’ అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. వెస్ట్‌ పాయింట్‌ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్‌ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు. ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది.  

మైక్‌ పెన్స్‌  
ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్‌ పెన్స్‌ ఈసారి అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్‌ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది.  ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్‌ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్‌ నిరాకరించారు.

అప్పట్నుంచి పెన్స్‌పై గుర్రుగా ఉన్న ట్రంప్‌ ఆయనని ఒక పిరికివాడుగా ముద్ర వేస్తూ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌కి మదుస్వభావిగా పార్టీలో మంచిపేరుంది.  తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రతినిధుల సభకు ఎన్నికైన పెన్స్‌ 2013 వరకు కాంగ్రెస్‌ సభ్యునిగా ఉన్నారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు. కరడు గట్టిన సంప్రదాయవాదిగా ముద్రపడిన పెన్స్‌ 2016లో ట్రంప్‌ అభ్యరి్థత్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి సై అంటున్నారు.  

రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ? 
ట్రంప్‌ అధ్యక్ష అభ్యరి్థగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్‌ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యరి్థగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్‌ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్‌ వేవ్‌ వస్తుందని అత్యధికులు ఆశించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు.

మరీ ముఖ్యంగా ట్రంప్‌ అనుచరులందరూ ఓటమి పాలవడం,  కేపిటల్‌ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌ విధానాలకు గ్రాండ్‌ ఓల్డ్‌     పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్‌ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది.  30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్‌ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి.
చదవండి: ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top