మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఫోన్‌ | PM Modi, Macron stress upon need to urgently restore safety | Sakshi
Sakshi News home page

మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఫోన్‌

Apr 16 2026 9:04 PM | Updated on Apr 16 2026 9:11 PM

 PM Modi, Macron stress upon need to urgently restore safety

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఫోన్‌ చేశారు. హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ భద్రత, స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు. ఇరువురు నేతలు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. పశ్చిమాసియా స్థిరత్వం కోసం భారత్‌, ఫ్రాన్స్‌ సహకారాన్ని కొనసాగిస్తాయని ఇరువురు నేతలు అన్నారు.

“నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాం. హార్మూజ్ జలసంధిలో భద్రత, నావిగేషన్ స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరంపై ఉందని మాట్లాడుకు‍న్నాం. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సహకారం కొనసాగిస్తాం” అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మారుతూ ఉండడడంతో భారత్ ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముందుగా మార్చిలో కూడా ప్రధాన మంత్రి మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.

ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ మాట్లాడి పశ్చిమాసియా భద్రతా పరిస్థితిపై చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

గురువారం ఢిల్లీలో మోదీ, ఆస్ట్రియా చాన్స్‌లర్ క్రిస్టియన్ స్టాకర్ పశ్చిమాసియాలో సముద్ర మార్గ రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా కొనసాగాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. “ఇరు పక్షాలు పశ్చిమాసియా ప్రాంతంలో తాజా పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు, దౌత్య ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అందులో సముద్ర రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా సాగడం అనే అంశం కూడా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సీబీ జార్జ్ ప్రెస్ బ్రీఫింగ్‌లో తెలిపారు.

40 దేశాల నేతల చర్చలు 
ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఈ కాల్... ఫ్రాన్స్, యూకే కలిసి 40 పైగా దేశాలను ఒకే తాటికి తీసుకొచ్చి సంయుక్త సమావేశం నిర్వహించే నేపథ్యంలో వచ్చింది. దీని లక్ష్యం హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ ఉండేలా చేయడం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 17న) పారిస్‌లో జరుగుతుందని తెలిపారు. 

హార్మూజ్‌ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement