పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే..

NewLimit: Crypto billionaire Is founded An Anti Aging Startup - Sakshi

వయసును జయించాలన్నది మనిషి చిరకాల కోరిక! వృద్ధాప్య ప్రక్రియను వెనక్కు మళ్లించేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా నేటికీ నిత్య యవ్వనం అందని ద్రాక్షలానే ఉంది. తాజాగా ఈ యుగపు టెక్నాలజీగా చెప్పుకుంటున్న కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రయోగానికి ఓ సంస్థ సిద్ధమైంది! మరి మనిషి నిరీక్షణ ఇప్పటికైనా ఫలిస్తుందా?  

క్రిప్టో కరెన్సీ ‘కాయిన్‌బేస్‌’ సృష్టికర్త, బిలియనీర్‌ బ్రియన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ (38) ఇటీవల ‘న్యూలి మిట్‌’ పేరిట కొత్త కంపెనీ పెట్టాడు. పేరులో ఉన్నట్లే ఈ కంపెనీ మనిషి మేధకు కొత్త పరిధిని నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది! పెరిగే వయసుకు కళ్లెం వేసి జీవితకాలాన్ని పొడిగించేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టడం న్యూలి మిట్‌ నిర్దేశించుకున్న లక్ష్యం! మనిషి జన్యువులు తీరుతెన్నులను కృత్రిమ మేధ (ఏఐ)లో భాగమైన మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో విశ్లేషించడం ద్వారా వృద్ధాప్యాన్ని నిలువరించడంతో పాటు తిరిగి యవ్వనాన్ని తెచ్చే కొత్త, వినూత్న చికిత్సలను అందు బాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ప్రయత్నంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బయోఇంజనీరింగ్‌ శాస్త్రవేత్త బ్లేక్‌ బయర్స్‌ మద్దతిస్తున్నారు.

కణాలకు మళ్లీ శక్తితో...
మానవ కణాలకు కొత్త పనులు అప్పగించడం ద్వారా నిత్య యవ్వనాన్ని సులువుగానే సాధించవచ్చని న్యూలిమిట్‌ అంటోంది! చిన్నప్పుడు మన కణాలు చాలా చురుకుగా ఉంటాయని, వయసు పెరిగేకొద్దీ వాటిల్లో మార్పులొచ్చి తమ పూర్వపు శక్తిని కోల్పోతాయని న్యూలి మిట్‌ చెబుతోంది. కణాలకు ఆ శక్తిని మళ్లీ అందిస్తే నిత్య యవ్వనం సాధ్యమని పేర్కొం టోంది. జీవశాస్త్రం అభివృద్ధితో డీఎన్‌ఏ క్రమాన్ని మాత్రమే కాకుండా.. అంతకంటే తక్కువ సైజుండే ఆర్‌ఎన్‌ఏ జన్యుక్రమాలనూ సులు వుగా తెలుసుకోగలుగుతున్నామని... ఇవన్నీ తమ పరిశోధనలకు ఉపయోగ పడతాయని న్యూలిమిట్‌ చెబుతోంది.


చదవండి: ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్‌ యూనివర్సిటీ హెచ్చరిక

ఎపిజెనిటిక్స్‌ మార్గం...
వయసును వెనక్కు మళ్లించేందుకు న్యూలిమిట్‌ ఎపిజెనిటిక్స్‌ మార్గాన్ని ఎంచుకుంది. డీఎన్‌ఏ నిర్మాణంలో వచ్చే మార్పులను ఎపిజెనిటిక్స్‌ అంటారన్నది తెలిసిందే. మన శరీర కణాల్లో కొన్నింటిని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు సుమారు 15 ఏళ్ల క్రితం గుర్తించారు. చర్మ కణాలను తీసుకొని వాటిని మెదడు కణాలుగా మార్చవచ్చన్నమాట. కేవలం నాలుగు రకాల ప్రొటీన్‌లను ఉపయోగించడం ద్వారా ఈ అద్భుతం సాధ్యమవుతుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కణాలకు కొత్త రకమైన పనులు అంటే మృత కణాలను వేగంగా తొలగించడం, కొత్త కణాలను తయారు చేయడం వంటివి అప్పగిస్తే వయసును తగ్గించవచ్చని న్యూలిమిట్‌ భావిస్తోంది. 
చదవండి: ఫిలిప్పీన్స్‌ తుపాను.. 375కు చేరిన మరణాలు

అందరికీ అందుబాటులో..
నిత్య యవ్వనం కోసం తాము అభివృద్ధి చేసే ఏ చికిత్స అయినా అందరికీ అందుబాటులో ఉంచుతామని న్యూలిమిట్‌ హామీ ఇస్తోంది. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, కంప్యూటర్ల వంటి సైన్స్‌ అద్భుతాలన్నీ ప్రాథమిక శాస్త్ర పరిశోధనల ఫలితాలుగా పుట్టుకొచ్చినవేనని, మొదట్లో వాటి ఖరీదు ఎక్కువగానే ఉన్నా వాడకం పెరిగినకొద్దీ ధర కూడా తగ్గుతూ వచ్చిందని న్యూలిమిట్‌ గుర్తుచేసింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top