నేపాల్‌ పార్లమెంటు రద్దు

Nepal Parliament Dissolved - Sakshi

ప్రధాని ఓలి ఆకస్మిక నిర్ణయం; పార్లమెంటు రద్దుకు సిఫారసు 

ఈ నిర్ణయంపై ప్రచండ వర్గం,విపక్షాల విమర్శలు 

కఠ్మాండు: అధికార పక్షంలోని ప్రత్యర్థులకు నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఊహించని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంటును రద్దు చేయడంతో పాటు మధ్యంతర సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్‌– మే నెలల్లో జరుగుతాయని ప్రకటించారు. అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి, మాజీ ప్రధాని పుష్పకుమార్‌ దహల్‌(ప్రచండ)ల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆదివారం ఉదయం ప్రధాని ఓలి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన మంత్రి మండలి.. తక్షణమే పార్లమెంటును రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారికి సిఫారసు చేసింది.

ఈ సిఫారసుకు వెంటనే అధ్యక్షురాలు భండారీ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలి కాంగ్రెస్‌తో పాటు అధికార పక్షంలోని అసమ్మతి వాదులు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓలి మంత్రివర్గంలోని, ప్రచండ వర్గానికి చెందిన ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభకు తొలి దశ మధ్యంతర ఎన్నికలు ఏప్రిల్‌ 30న, తుది దశ ఎన్నికలు మే 10న జరుగుతాయని రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. నేపాల్‌ పార్లమెంట్లో దిగువ సభను ప్రతినిధుల సభగా వ్యవహరిస్తారు. ఎగువ సభను నేషనల్‌ అసెంబ్లీగా పిలుస్తారు.

ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రధాని ఓలి నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, నియంతృత్వ ఆలోచనతో తీసుకున్న నిర్ణయమని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ట విమర్శించారు. పార్టీ స్టాండింగ్‌ కమిటీ ఓలి నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఓలిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది.  2018లో ఓలి నాయకత్వంలోని సీపీఎన్‌ –యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌(మావోయిస్ట్‌ సెంటర్‌) విలీనమై ఎన్‌సీపీగా ఏర్పడ్డాయి.  పార్టీలోని అత్యున్నత విభాగం సెక్రటేరియట్‌లో ప్రచండదే పైచేయి కావడం గమనార్హం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top