మేఘన్‌ జాతివివక్ష ప్రకంపనలు

Meghan And Harry Interview: Racism Drove Us From Royal Family - Sakshi

తీవ్రంగా చూడాలన్న ప్రతిపక్ష నాయకుడు స్టార్మర్

లండన్‌: ప్రిన్స్‌ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్‌ రాచకుటుంబంలో జాతి వివక్షని ఎదుర్కొంటూ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నటి మేఘన్‌ మార్కెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది.  మేఘన్‌ వెల్లడించిన విషయాలు బ్రిటన్‌ రాచకుటుంబాన్నే సంక్షోభంలో పడేశాయి. ఈ సంక్షోభ నివారణకు రాణి ఎలిజెబెత్‌–2 ఒక ప్రకటన కూడా సిద్ధం చేశారని , కానీ ఇంకా దానిని విడుదల చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తున్నారంటూ బ్రిటన్‌లో ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ ఆ ఇంటర్వ్యూలో తమకి పుట్టబోయే బిడ్డపై కూడా రాచకుటుంబం చర్చించుకుందని, ఆ బిడ్డ నల్లగా పుడతాడని, అందుకే ప్రిన్స్‌ హోదా, భద్రత కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని వెల్లడించారు.

మేఘన్‌ జాతి వివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ను అడగ్గా ‘‘నాకు రాణి పట్ల అమితమైన గౌరవ భావం ఉంది. కామన్‌వెల్త్‌ దేశాలన్నింటినీ ఏకం చేసి ఉంచినందుకు ఆమెను ఎప్పటికీ ఆరాధిస్తాను’’అని జాన్సన్‌ పేర్కొన్నారు. ‘‘రాచకుటుంబ విషయాలపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించనని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాను’’అని జాన్సన్‌ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు సర్‌ కేర్‌ స్టార్మర్‌ ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు.

తూర్పు లండన్‌లో ఒక పాఠశాలని దర్శించడానికి వచ్చిన ఆయన దగ్గర మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించగా ‘‘రాచకుటుంబం ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత విచారకరం. మేఘన్‌ చెప్పిన జాతివివక్ష, ఆమె మానసిక ఆరోగ్యమనేవి అత్యంత తీవ్రమైన అంశాలు. రాచకుటుంబం కంటే ఇవి పెద్ద విషయాలు. 21వ శతాబ్దాంలో బ్రిటన్‌లో జాతివివక్షకు సంబంధించిన ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’’అని స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు మేఘన్‌ తండ్రి థామస్‌ మార్కెల్‌ కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఇలా మాట్లాడడం చూస్తున్నానని అన్నారు.  

స్పందించిన బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ 
ప్రకంపనలకు కారణమైన ప్రిన్స్‌ హ్యారీ దంపతుల ఇంటర్వ్యూపై బిట్రన్‌ రాణి ఎలిజబెత్‌ ఎట్టకేలకు మౌనం వీడారు. హ్యారీ, మేఘన్‌ దంపతులు గడిచిన రెండేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఆవేదన చెందుతున్నామనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలయింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యక్త పరిచిన అంశాలు తీవ్రమైనవని పేర్కొంది. తమ కుటుంబానికి హ్యారీ, మేఘన్‌ దంపతులు ఎప్పటికీ అత్యంత ప్రియమైన వారిగానే ఉంటారని తెలిపింది.   

చదవండి: (ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top