ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు

Managing negative emotions could be key to slowing pathological ageing - Sakshi

భావోద్వేగాలు నియంత్రించుకోవాలి 

యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా అధ్యయనం  

లండన్‌:  వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు.

ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు.

యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్‌ ఎంఆర్‌ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్‌ ఏజింగ్‌ పత్రికలో ప్రచురించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top