Israel Vs Hamas: ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు.. | Sakshi
Sakshi News home page

Israel Vs Hamas: ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు..

Published Sun, Apr 7 2024 9:11 AM

Israel Six Month War In Gaza Over Tousand Of Deaths - Sakshi

Israel Vs Hamas War..
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి ఈరోజుతో ఆరు నెలల కాలం పూర్తైంది. గతేడాది అక్టోబర్‌ 7వ తేదీన ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడికి ఇజ్రాయెల్‌ ప్రతీ దాడులు చేస్తూ.. హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది.

యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో పాలస్తీనీయుల వెతలు.. యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. గాజా ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్‌ ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. ‘ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌’ పేరిట గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్‌ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్‌.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. హమాస్‌ అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. 

ఇజ్రాయెల్‌ ప్రతి దాడుల కారణంగా ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్‌ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. 

గాజాలో విపత్కర పరిస్థితులు..
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ దాడుల కారనంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయింది. విపత్కర పరిస్థితుల్లో ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం కారణంగా ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రి కొరతతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.

అమెరికా అసంతృప్తి..
గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ వెంటనే ఆపాలని అనేక దేశాలు కోరుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. మరోవైపు, హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల కాల్పుల విరమణ విషయంలో జో బైడెన్‌.. నెతన్యాహును హెచ్చరించారు కూడా. పౌరుల రక్షణ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. 

నేడు మరో రౌండ్‌ చర్చలు..
కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఆదివారం జరగనున్న మరో రౌండ్‌ చర్చలకు హమాస్‌ బృందం కైరో వెళ్తోంది. గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు.. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మందిని హత్య చేసి 250 మందిని బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 109 మంది విడుదలయ్యారు. మిగిలిన వారిని విడిపించేందుకు చర్చలు జరుగుతున్నాయి. హమాస్‌ చెరలోనే 36 మంది వరకు బందీలు ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ చెందిన కమాండర్లు, కీలక నేతలు కూడా చనిపోయిన విషయం తెలిసిందే. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement