ఒక్క ఆలూ చిప్‌.. ధర ఏకంగా రూ.14 లక్షలు

Doritos Company Pays Rs 14 Lakh to Australia Girl for Discovering Rare Chip - Sakshi

ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఘటన

సరదాగా చేసిన పనితో లక్షాధికారి అయిన బాలిక

వెబ్‌డెస్క్‌: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. కొందరు ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లభించక బాధపడతారు.. కానీ కొందరి జీవితంలో జరిగే సంఘటనలు చూస్తే.. చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరదాకి చేసే పనులు కూడా వారికి బాగా కలసివస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. తినే చిప్స్‌లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో చాలామంది దాన్ని వేలం వేయమని సూచించారు. వేలంలో ఆ చిన్న ఆలూ చిప్‌ ఏకంగా 14 లక్షల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్‌కు బంగాళాదుంప చిప్స్ తినడం అంటే ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్‌ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఓసారి రైలీ డోరిటోస్‌ చిప్స్‌ ప్యాకెట్‌ తీసుకువచ్చింది. దానిలో ఆమెకు ఓ చిత్రమైన చిప్‌ ముక్క కనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా... సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వెరైటీగా ఉండటంతో రైలీ దాన్ని దాచుకోవాలని భావించింది. ఈ క్రమంలో ఆ చిప్‌ ముక్కను వీడియో తీసి... టిక్‌టాక్‌లో ఉబ్బిన స్నాక్ పేరుతో అప్‌లోడ్ చేసింది.

సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్‌ వీడియో తెగ వైరలయ్యింది. ఆ తర్వాత ఇది కాస్త ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో కూడా షేర్‌ అయ్యింది. ఇక టిక్‌టాక్‌లో దీనికి మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. విభిన్నంగా ఉన్న ఈ చిప్‌ని కొనేందుకు నెటిజనులు ఆసక్తి కనపర్చడంతో.. రిలే దాన్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దాన్ని ఈబే సైట్‌లో లిస్ట్‌ చేసింది. చిప్‌ ఖరీదు ఒక్క డాలర్‌ కంటే తక్కువ కోట్‌ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. 

ఆ చిప్ ముక్కకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భారీగా డబ్బులిచ్చి కొనేందుకు ముందుకొచ్చారు. ఇలా వేలం కొనసాగుతూ ఉండగా... డోరిటోస్ కంపెనీకి ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన కంపెనీ... బిడ్డింగ్‌లో పాల్గొని అందరికంటే చాలా ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విషయం తెలిసి రిలే కుటుంబం సంతోషంతో ఉబితబ్బయ్యింది. ఇక ఏదో సరదాకు చేసిన పనికి ఇంత భారీ ఎత్తున డబ్బు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ సంతోషంతో గంతులు వేస్తుంది రిలే.

ఎందుకు అంత ధరంటే..
ఒక చిన్న ఆలూ చిప్‌ ముక్కను రూ.14 లక్షలు పెట్టి కొనేందుకు డోరిటోస్ ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. "మరెవరైనా అయితే... ఆ ముక్కను కూడా తినేవారేమో... కానీ ఆ బాలిక క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసింది. దానితో బిజినెస్ చేసింది. ఆమె ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. పైగా ఆమె కుటుంబం మా చిప్స్‌కి అభిమానులు. అందుకే ఇలా చేశాం" అని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top