భారత్‌పై ఆక్రోశం‌? చక్కెర, పత్తికి పాకిస్తాన్‌లో‌ తిప్పలు

Day After Pakistan U Turn On Cotton, Sugar Import - Sakshi

ఇస్లామాబాద్‌: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్‌ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్‌ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది.

2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్‌ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్‌ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్‌లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్‌ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది.

భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్‌ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్‌ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top