బలప్రయోగానికీ వెనుకాడం

China will never renounce the right to use force over Taiwan says Xi Jinping - Sakshi

చైనాలో తైవాన్‌ అంతర్భాగం

పునరేకీకరణను పూర్తి చేయడమే లక్ష్యం: జిన్‌పింగ్‌   

బీజింగ్‌: తైవాన్‌ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్‌ దేశాధిపతి, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్‌ తేల్చిచెప్పారు. తైవాన్‌ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు.

రాజధాని బీజింగ్‌లోని ‘ఆర్నేట్‌ గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ద పీపుల్‌’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. తైవాన్‌ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.  

‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి  
చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్‌పింగ్‌ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్‌ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్‌ ల్యాండ్‌) కలిపేయడమే. జిన్‌పింగ్‌ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్‌ అంశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్‌పింగ్‌ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్‌ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం.

ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్‌ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు.

చైనా–తైవాన్‌ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్‌పింగ్‌ తెలియజేశారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్‌ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్‌పింగ్‌ వివరించారు.  హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు.

అగ్రనేతలకు స్థానచలనం!  
కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్‌పింగ్‌ మినహా పార్టీలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్‌–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్‌ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్‌ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్‌పింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్‌ జెమిన్‌ హాజరు కాలేదు. జిన్‌పింగ్‌ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top