'సూపర్‌ మూన్‌'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. 

The Biggest Super Moon of the Year 2022 Will be Seen on July 13 - Sakshi

వాషింగ‍్టన్‌: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్‌' కనువిందు చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ అద్భుతాన్ని దర్శించుకోనున్నాయి. నిండు చంద్రుడిని బక్‌ సూపర్‌ మూన్‌, థండర్‌ మూన్‌, హేమూన్, మెడ్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు. 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13న ఈ సూపర్‌ మూన్‌ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ ‍అద‍్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అయితే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న కనిపించనుంది. ఇలా భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన నిండైన చంద్రుడిని మూడు రోజుల పాటు చూడొచ్చు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం తెల్లవారు వరకు కనువిందు చేయనుంది జాబిల్లి. 

సూపర్‌ మూన్‌ అంటే ఏమిటి? 
తన కక్షలో తిరుగుతున్న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు నిండుగా, అతిపెద్దగా కనిపిస్తుంది. దానినే సూపర్‌మూన్‌గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్‌ నొల్లే 1979లో ఈ సూపర్‌ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్‌మూన్‌ ఏర్పడుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చూట్టివస్తాడు చంద్రుడు. అలా అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని పేరీజీ అంటారు. భూమి నుంచి 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దూరంలోని స్థానాన్నిఅపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణం కంటే 17శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా సూపర్‌మూన్‌ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. గత నెల జూన్‌లో సంభవించిన సూపర్‌మూన్‌ను స్ట్రాబెరీ మూన్‌గా వ్యవహరించారు. 

ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్‌' యాత్ర

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top