ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్‌ కిడ్నాప్‌.. వీడియో వైరల్‌ | American Journalist Shelly Kittleson Kidnapped In Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్‌ కిడ్నాప్‌.. వీడియో వైరల్‌

Apr 1 2026 3:07 PM | Updated on Apr 1 2026 3:13 PM

American Journalist Shelly Kittleson Kidnapped In Iraq

ఇరాక్‌లో అమెరికన్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌(Shelly Kittleson) కిడ్నాప్  కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న ఓ ఇరాకీ సాయుధ ముఠా బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్‌ను కిడ్నాప్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రాంతీయ భద్రత క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటెల్సన్‌ ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సిరియా, ఇరాక్, లెబనాన్ నుంచి ఆమె విస్తృతంగా వార్తా కథనాలను అందించారు. ఆమెను విడిపించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

కిడ్నాప్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూప్ ‘కతైబ్ హెజ్బల్లా’కు చెందిన వ్యక్తిని ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ తెలిపారు. నిందితులు పారిపోయే క్రమంలో వాహనం బోల్తా పడటంతో ఇరాక్ భద్రతా దళాలు ఒకరిని అరెస్ట్ చేశాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కిటెల్సన్‌ రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఇరాక్, సిరియాలోని తెగల మధ్య సంబంధాలు, యుద్ధ ప్రాంతాలపై ఆమెకు లోతైన అవగాహన ఉంది. ఆమె కిడ్నాప్‌పై 'అల్-మోానిటర్' సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాగ్దాద్ వీధుల్లో నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవి దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాక్ ప్రభుత్వానికి, అక్కడి ఇరాన్ అనుకూల మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు పెరిగాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాక్‌లో అమెరికన్లకు ముప్పు పెరిగిందని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2023లో కూడా విద్యావేత్త ఎలిజబెత్ త్సుర్కోవ్‌ను కిడ్నాప్ చేసి రెండేళ్లపాటు బందీగా ఉంచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికన్లు, జర్నలిస్టులు ఇరాక్‌లో అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement