
వెంగళరావునగర్‌లో హైడ్రా కమిషనర్ పర్యటన
వెంగళరావునగర్: నగరంలోని వెంగళరావునగర్‌లో వివాదంలో ఉన్న స్థలాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. మోతీనగర్ మార్గంలో ఉన్న ఈ పార్కు స్థలం కబ్జాకు గురైందని స్థానికుల గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నలంద స్కూల్‌కు చేరువలో ఉన్న ఈ 9800 చదరపు గజాల స్థలం పార్కు కోసం కేటాయించారని. అయితే కొందరు అది తమదే అంటూ ఆక్రమించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి స్థానికుల సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. ఆ స్థలంపై హక్కులు ఉన్నట్లు చెప్తున్న వారు సంబంధిత పత్రాలను తీసుకుని రావాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాతే అది పార్కు స్థలమా, ప్రైవేట్‌దా అనేది తేలుస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. అప్పటి వరకు అక్కడ ఆక్రమణలు తొలగించి జీహెచ్‌ఎంసీకి చెందిన స్థలంగా బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కోరారు.