
బంజారాహిల్స్: వారాంతం వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్దామా.. ఏ పర్యాటక ప్రాంతాన్ని చూసొద్దామా అని కొందరు ఉవ్విళూరుతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తారు. చల్లని సాయంత్రం తాము చదివే పుస్తకాన్ని వెంట తెచ్చుకుంటారు. తమలాంటి వారందరినీ ఆహ్వానిస్తారు. రెండు గంటలపాటు కలిసి చదువుకుంటారు. టీ/కాఫీ తాగుతూ తాము చదివే పుస్తకాలపై అభిప్రాయాలను పంచుకుంటుంటారు.. ఇది ఎక్కడో కాదు. నగరంలోని పచ్చని చిగురుటాకుల వనం కేబీఆర్ పార్క్‌లో.. ప్రతీ శనివారం సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది పుస్తక పఠనం. ప్రధాని నరేంద్ర మోదీ పుస్తక పఠనం గురించి మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన ఇద్దరు ఏర్పర్చిన ‘కబ్బన్ రీడ్స్’ గురించి ఉదహరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ముఖ్య నగరాలు, పట్టణాలలో సుమారు వంద ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు వీటిని. ఇందులో నగరంలోని కేబీఆర్ పార్క్ ఒకటి (హైదరాబాద్ రీడ్స్). ఇక్కడి ప్రశాంత వాతావరణం.. పక్షుల కిలకిలారావాలు.. నెమళ్ల సోయగాల మధ్య పుస్తకాలు చదవటం గొప్ప అనుభూతి కలిగించే విషయం.
ఉత్సాహంగా.. సరికొత్తగా..
కరోనా సమయంలో ఒంటరితనంతో, వర్క్ ఫ్రం హోంతో సాముహిక జీవితంలో మనుషులు ఇమడలేని తనంలోంచి బయటపడేస్తూ బుక్ రీడ్స్ కొత్త తరాన్నంత ఒకటి చేస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జూన్ 3న బుక్ రీడ్స్ ప్రారంభమై ప్రతీ వారం కొనసాగుతోంది. దీనిని ప్రియాంక పిరంశెట్టి, శ్లోక చంద్ర మొదలు పెట్టారు. ఇందులో మూడేళ్ల పిల్లలు, యువతీ యువకులు, వృద్ధుల వరకు పాల్గొంటున్నారు. నగరంలో వివిధ వృత్తులు చేస్తుండే, వివిధ భాషలలోని వారు వారంలో కొన్ని గంటలను ఒకే అభిరుచి కల్గిన మనుషుల మధ్య గడుపుతారు. ఈ సమయం ఎంతో ఉత్సాహం ఇస్తుందని సభ్యులు పేర్కొంటున్నారు. నవలలు, కవిత్వం, కథలు, చరిత్ర, పురాణాలు, వైజ్ఞానిక అంశాలు.. ఇలా ఎవరికి నచ్చిన అంశంలో వారు ఆయా పుస్తకాలు చదవడం, ఒకరి నుంచి మరొకరు అభిప్రాయాలు, పుస్తకాలు పరిచయం చేసుకుంటూ పంచుకుంటూ కొత్త స్నేహాలు ఏర్పర్చుకుంటున్నారు. పాఠకులు తమ దుప్పటి/మ్యాట్ తెచ్చుకుని పార్క్‌లో తమకు నచ్చిన స్థానంలో కూర్చుంటారు. ఇలాంటి వేదికలు నగరంలో విస్తరిస్తున్నాయి. అలాగే.. ప్రస్తుతం సికింద్రాబాద్ రీడ్స్, గండిపేట రీడ్స్ ఏర్పడ్డాయి.
పుస్తకాల్లో మనుషులుంటారు
‘పుస్తకాలలో మనుషులుంటారు’ అని రష్యన్ రచయిత గోర్కీ అంటాడు. ఆ మనుషులను చదవటం భలే ఇష్టంగా ఉంటుంది. అందులోనూ మనలాంటి అభిరుచి ఉన్న మనుషుల మధ్య కూర్చుని చదవటం చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరి ఏకాంత ప్రపంచంలో వారు ఎప్పుడూ ఉండకుండా. సాముహిక ప్రపంచంలో కొన్ని గంటలు కేటాయించడం తృప్తిగా ఉంటుంది. చదవటం ఇష్టానికి సంబంధించినది కాదు. అది ఒక అందమైన పని. బాధ్యత.
– ఏవీ అరవింద్, సినీ రచయిత, ఫొటోగ్రఫర్
ప్రియ నేస్తాలు
పుస్తకాలు ప్రియనేస్తాలు. అంతేకాదు కేబీఆర్ పార్కులో హైదరాబాద్ రీడ్స్‌లో నేను ప్రతి శనివారం సహచరులతో కలిసి పుస్తక పఠనం చేస్తుంటే కొత్త నేస్తాలు పరిచయం అవుతున్నారు. ఒక వైపు పుస్తకం, మరోవైపు కొత్త నేస్తం సరికొత్త అనుభూతులకు కేబీఆర్ పార్కు నెలవుగా మారుతోంది. ఇదొక మంచి స్థలం. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒకే చోట కలుస్తుండటంతో ఒకరి నుంచి మరొకరు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కరోనా సమయంలో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్ రీడ్స్‌తో అనుబంధాలు మళ్ళీ పెనవేసుకుంటున్నాయి. – షామోహిత
సాహిత్య గ్రంథాలు ఎక్కువగా తిరగేస్తున్నాం|
కేబీఆర్ పార్కులో ప్రతి శనివారం రెండు గంటల పాటు పుస్తక ప్రియులమంతా కలిసి చదువుకోవడమే కాకుండా ఆ తర్వాత ఆ పుస్తకాల్లోని భావాలను పంచుకుంటున్నాం. ఒకే ఆలోచన గల వ్యక్తులంతా ఒక చోట చేరడం వల్ల అభిప్రాయ మార్పిడి మంచి ఫలితాలిస్తోంది. కరోనా తర్వాత మంచి స్నేహాల కోసం తపిస్తున్న వారికి కేబీఆర్ పార్కులో బుక్ రీడింగ్ ఒక మంచి వేదికగా నిలుస్తోంది. ప్రతీ శనివారం కోసం ఎదురు చూస్తుంటాం. ఇక్కడ ఎక్కువగా బెంగాలీ, మలయాళీ లిటరేచర్ పుస్తకాలు చదువుంటాం. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కూడా తిరగేస్తుంటాం.
– నుస్రత్ ఖాద్రి
