
బంజారాహిల్స్ రోడ్ 14లో నిలిచిన వరద నీరు...
బంజారాహిల్స్: కుండపోతగా కురిసిన వర్షంతో ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి వరద నీరు అక్కడే నిలిచిపోవడంతో స్థానికులు నరకాన్ని చూశారు. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. బురద పేరుకుపోవడంతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు దుర్గంధం నెలకొంది. ఫిలింనగర్‌లోని 18 బస్తీలు వరదధాటికి విలవిల్లాడాయి. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమాజిగూడలో రహదారులపై బురద పేరుకుపోయింది. శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, కమలాపురి కాలనీ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి స్థానికులు నరకాన్ని చవి చూశారు. చింతల్‌బస్తీ ప్రధాన రహదారి నీట మునిగింది. ఉదయం పనులకు వెళ్లే స్థానికులు, వ్యాపారులు వరద నీటిలోనే ప్రయాణాలు సాగించారు.
పత్తా లేని జీహెచ్‌ఎంసీ సిబ్బంది
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ప్రధాన రహదారులపై నడుముల్లోతు వరకు వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, వాకర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు వెళ్లే మార్గాలన్నీ వ్యర్థాలు, రాళ్లు, చెత్తా చెదారంతో నిండిపోవడంతో వరద ప్రవాహం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బంజారాహిల్స్‌లోని సింగాడికుంట, ఉదయ్‌నగర్, అంబేడ్కర్‌నగర్, ప్రాంతాలు నీటమునిగాయి. పంజగట్ట ప్రధాన రహదారి నీటమునిగింది. ఇక్కడ కూడా వరద నీరు వెళ్లే మార్గాలన్నీ వ్యర్థాలతో నిండిపోవడంతో నివాసాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ యాక్షన్ టీమ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వరద నీటితోనే సహవాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమస్యను పరిష్కరించలేక చేతులెత్తేశారు. రహదారులు, బస్తీలు జలమయమైనా పట్టించుకునేవారు కరువయ్యారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దారిలో వరద నీటిని తోడుతున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది


