గ్రామీణ ప్రాంతంలో 3.9%.. పట్టణ ప్రాంతంలో 6.8%
జాతీయ సగటుతో పోల్చుకుంటే ఎక్కువగానే నిరుద్యోగిత
ఉద్యోగం, చదువు, శిక్షణ లేని వారి శాతం భారీగానే..
పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే–2025 వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుతోంది. కోవిడ్–19తో పెద్ద ఎత్తున పెరిగిన నిరుద్యోగిత క్రమంగా గాడిన పడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడంతో ఏయేటికి ఆ ఏడు నిరుద్యోగిత రేటు కూడా తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు కేంద్ర అర్ధ గణాంకాల శాఖ ‘పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే–2025’పేరుతో శుక్రవారం నివేదికను విడుదల చేసింది. తెలంగాణలో నిరుద్యోగిత 5 శాతం ఉన్నట్లు ఈ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతంలో 3.9 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 6.8 శాతం, మొత్తంగా జాతీయ స్థాయి కంటే ఎక్కువగా 5.0 శాతం ఉంది. అదే జాతీయ స్థాయిలో నిరుద్యోగం గ్రామీణ ప్రాంతంలో 2.4 శాతం, పట్టణ ప్రాంతంలో 4.8 శాతంగా ఉంది. మొత్తం మీద 3.1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. దేశంలో గత నాలుగేళ్లలో నిరుద్యోగిత శాతం గ్రామీణ ప్రాంతాల్లో 0.8 శాతం తగ్గగా, పట్టణ ప్రాంతంలో 1.1 శాతం తగ్గింది.
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ శాఖ జాతీయ గణాంకాలతో పాటు రాష్ట్రాల్లో పరిస్థితిని విశ్లేషిస్తూ వివరాలు వెల్లడించింది. 2022లో కోవిడ్–19 ప్రభావంతో నిరుద్యోగం భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో 2.8 శాతం నిరుద్యోగం ఉండగా.. క్రమంగా తగ్గుతూ 2.4 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతంలో 5.9 శాతంగా ఉన్న నిరుద్యోగం 4.8కు తగ్గింది.
మహిళల వేతనాల్లో వృద్ధి
రాష్ట్రంలో ఉద్యోగం, చదువు, శిక్షణ లేని వారి శాతం భారీగానే ఉంది. 15–24 ఏళ్ల యువతలో ఇలాంటి వారు 21.1శాతం ఉండగా, 15–29 ఏళ్ల వయసున్న వారిలో 26.2 శాతం, 30–59 ఏళ్ల మధ్య వారిలో 20.6 శాతం ఉన్నారు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు 22.6 శాతం ఉన్నారు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జాతీయ సగటు నిరుద్యోగిత 3.4 శాతం ఉండగా, రాష్ట్రంలో 5.3 శాతంగా ఉంది.
» మహిళల వేతనాల్లో వృద్ధి వేగంగా ఉంది. స్వయం ఉపాధిలో 8.8% పెరుగుదల నమోదు కాగా, రెగ్యులర్ ఉద్యోగాల్లో 7.2% , కూలి పనుల్లో 5.4% పెరుగుదల నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల ఆదాయం ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.
» గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల ఉపాధి 80.5%గా ఉండగా, మహిళల ఉపాధి 45.9%గా ఉంది. పురుషులకు విద్య, నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు పెరుగుతుండగా... మహిళల్లో 44.4% మంది గృహ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వల్ల ఉద్యోగాల్లోకి రాలేకపోతున్నారు. 2025లో దేశంలో 61.6 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉన్నారని అంచనా కాగా.. ఇందులో 41.6 కోట్ల మంది పురుషులు, 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు. దేశంలో కేవలం 4.2% మందికి మాత్రమే వృత్తి శిక్షణ లభించింది. యువతలో ఇది 5% మాత్రమే.


