ఔటర్‌ లోపలే సిటీ బస్సులు! | The number of RTC city services is going to decrease | Sakshi
Sakshi News home page

ఔటర్‌ లోపలే సిటీ బస్సులు!

Mar 28 2026 4:28 AM | Updated on Mar 28 2026 4:28 AM

The number of RTC city services is going to decrease

దూర ప్రాంతాలకు వెళ్లే వాటిని జిల్లా డిపోలకు బదిలీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం? 

వాటితోపాటు తదనుగుణ సంఖ్యలో సిబ్బంది బదిలీ 

నగరంలో అధిక హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ చెల్లింపు 

ఆ రూపంలో ఆర్టీసీ ఖజానాపై అధిక వేతన భారం  

దాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం 

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో డీజిల్‌ బస్సుల తరలింపు నిర్ణయం అమలు షురూ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సిటీ సర్వీసుల సంఖ్య తగ్గబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం నుంచి 30 కి.మీ. నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలకు తిరుగుతున్న సిటీ బస్సులను జిల్లా డిపోలకు తరలించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో ఆ బస్సులతోపాటు, తదనుగుణ సంఖ్యలో సిబ్బంది కూడా జిల్లాలకు తరలాల్సి ఉంది. సమీప భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే ఔటర్‌ రింగురోడ్డు లోపల తిరగనున్న విషయం తెలిసిందే. 

మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల రాక మొదలు కానుంది. అక్కడి నుంచి ఏడాది కాలంలో దాదాపు 2,300 బస్సులు సమకూరుతాయి. అప్పుడు ఇక్కడి డీజిల్‌ బస్సులను ఔటర్‌ ఆవలివైపు మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్‌ బస్సులన్నీ అద్దె ప్రాతిపదికన ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించనున్నందున, వాటిల్లో కండక్టర్లు మినహా మిగతా సిబ్బంది అవసరం ఉండదు. 

అప్పుడు డిపోల్లోని ఆయా కేటగిరీ సిబ్బంది అంతా జిల్లా డిపోలకు వెళ్లాల్సిందే. దీంతో ఇప్పటి నుంచే ఆ ప్రక్రియకు ఆర్టీసీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేవలం నగరం, నగర శివారు ప్రాంతాలకు తిరిగే బస్సులను మాత్రమే సిటీ డిపోల్లో ఉంచి, కాస్త దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను జిల్లాలకు తరలించే కసరత్తు మొదలుపెట్టింది.  

వ్యయ నియంత్రణ కోసం... 
గ్రేటర్‌ నగరం–జిల్లాలు... ఈ రెండు ప్రాంతాల్లో సిబ్బంది వేతనాల్లో తేడా ఉంటుంది. నగరంలో పనిచేసే వారి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రత్యేక నగర పరిహార భత్యం (సీసీఏ) ఉంటుంది. అంతమేర జీతాల పద్దు పెరిగి ఆర్టీసీ ఖజానాపై భారం మోపుతోంది.  
»  నగరంలో కి.మీ.కు వేతన భారం రూ.85 ఉంటుండగా, జిల్లాల్లో ఆ మొత్తం రూ.65గా ఉంటుందని గుర్తించారు.  
» ఇక అదనపు గంటలు పనిచేసినందుకు స్పెషల్‌ ఆఫ్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 8 గంటల డ్యూటీ బదులు 12 గంటల నుంచి 15 గంటలపాటు పనిచేయటం ద్వారా ఈ డబుల్‌ మస్టర్‌ నమోదవుతుంది. అంటే రెండు రోజులపాటు పనిచేసినట్టుగా భావించి మరుసటి రోజు పూర్తి సెలవు ఇస్తారు. ప్రత్యే క చెల్లింపు ఉంటుంది. ఈ స్పెషల్‌ ఆఫ్‌ పొందాలంటే నగరంలో 300–330కి.మీ. మేర అదనంగా బస్సు తిరిగితే చాలు.  
» జిల్లాల్లో అయితే 500 కి.మీ. అదనంగా బస్సుతో పాటు వెళ్లాల్సి ఉంటుంది. ఉత్పాదకతపై కూడా ప్రభావం ఉంటుంది. ఇలా అదనపు భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఇటీవల ఆర్టీసీ అధికారులు మేధోమథనం నిర్వహించి, నగరం నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న సర్వీసులను జిల్లాలకు పంపాలన్న ఆలోచనకొచ్చారు.  
» నగరంలో దాదాపు 400 వరకు బస్సులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అవి నగరం నుంచి 50 కి.మీ. దూరం వరకు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని, వాటితోపాటు నిర్ధారిత సంఖ్యలో సిబ్బందిని జిల్లాలకు పంపితే అంతమేర హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ భారం తగ్గుతుందన్న అంచనాకొచి్చంది.  
» ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తే ఈ సిబ్బంది జిల్లాలకు వెళ్లాల్సిన వారే అయినందున (కండక్టర్లు మినహా) కాస్త ముందుగా పంపనుంది. త్వరలో దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసి ఆ బస్సు ల బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సిబ్బంది కోరుకున్న జిల్లాలకు పంపే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement