కేయూలో న్యూపీజీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన
డైనింగ్ హాల్‌కు తాళం వేసి..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధానంగా హాస్టల్ భవనం నుంచి డ్రెయినేజీ సక్రమంగా లేదని, దీంతో మురుగునీరుతో దుర్వాసన వస్తోందన్నారు. దీనిని పలుమార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే, బాత్ రూమ్‌లు, టాయ్ లెట్స్‌లో సరిగా నల్లాలు లేవన్నారు. వివిధ గదుల్లోనూ సరిపడా ఫ్యాన్లు లేవని ఆరోపిస్తూ ఆందోళన కొనసాగించారు. ఈ సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హాస్టల్ భవనం వద్ద ఉన్న డైనింగ్ హాల్‌కు తాళం వేశారు. ఆందోళనపై సమాచారం అదుకున్న రిజిస్ట్రార్ వి. రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి వాసువేదరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని ఆయా సమస్యలను పరిశీలించారు. వీటిని పరిష్కరిస్తామని, దీనికి కొంత సమయం ఇవ్వాలని రిజిస్ట్రార్ కోరగా విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై రిజిస్ట్రార్‌ను వివరణ కోరగా డ్రెయినేజీతోపాటు ఇతర పలు సమస్యలున్నాయని, వాటిని రూ. 12లక్షల వ్యయంతో పరిష్కరిస్తామని వివరణ ఇచ్చారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో పోలీసులు కూడా ఘటనాస్థలికి విచ్చేశారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్


