కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం (చందా కాంతయ్య హాస్పిటల్) ఆస్పత్రికి అసలు ఆర్‌ఎంఓ ఎవరు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆర్‌ఎంఓ మురళితో పాటు మరో నలుగురు వైద్యులను అడిషనల్ ఆర్‌ఎంఓలుగా విధులు నిర్వర్తించారు. అయితే.. ఇటీవల సాక్షిలో ప్రచురితమైన ‘సీకేఎంలో దందా’ కథనానికి కలెక్టర్ స్పందించారు. స్వయంగా ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసినప్పటికీ బయటికి రానివ్వలేదు. ఈక్రమంలో ఆర్‌ఎంఓగా అన్నీ తానై విధులు నిర్వహించిన డాక్టర్ మురళిని తమ పోస్టు అయిన పిడియాట్రిక్ విభాగానికి పంపించారు. దీంతో వారం రోజుల పైనుంచి ఆర్‌ఎంఓ కుర్చీ ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అడిషనల్ ఆర్‌ఎంఓగా ఉన్న ఓ డాక్టర్ ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు అడిషనల్ ఆర్‌ఎంఓలు సూపరింటెండెంట్ అప్పజెప్పిన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ప్రసూతి దవాఖాన ఆర్‌ఎంఓ బాధ్యతలు చేపట్టడానికి ఏ అధికారి వస్తారో వేచి చూడాలి.


