హన్మకొండ కల్చరల్: బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞానస్వరూప రూపమే శివుడని పురాణాల్లో పేర్కొనట్లు వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వివరించారు. హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం చైత్రశుద్ధ అనంగత్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్.. రుద్రేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం రవీందర్, రమాదేవి దంపతుల సౌజన్యంతో స్వామివారిని పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ శివతత్వాన్ని భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
నేడు డయల్
యువర్ డీఎం ప్రోగ్రాం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు సలహాలు, సూచనల కోసం, సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు(మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
వరంగల్ స్పోర్ట్స్ : బెంగుళూరులోని కోరమంగళ స్టేడియంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన 4వ జాతీయ పారా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు పతకాలు సాధించి సత్తా చాటారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 స్వర్ణాలు, 2 రజత, 3 కాంస్య పతకాలతో రెండో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇ. గణేశ్‌యాదవ్ తెలిపారు. పైడిపల్లికి చెందిన గౌతమ్ యాదవ్ (పి–51), ఖిలా వరంగల్‌కు చెందిన కె. శివ (పి–52) బంగారు పతకాలు సాధించారు. నర్సంపేటకు చెందిన ఎం. మమత (పి–52) కేటగిరీలో సిల్వర్ మెడల్, వరంగల్‌కు చెందిన సాయక్ అబ్దుల్(పి–52), నర్సంపేటకు చెందిన ఎం.లోకేశ్(కె–44యు, 80 కేజీల) కాంస్య పతకాలు సాధించినట్లు గణేశ్‌యాదవ్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వీణా అరోరా, తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ డెలిప్ అభినందించారు.
ఆర్టీసీ ఆర్‌ఎంగా భవానీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.భవానీప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన ఆర్‌ఎం దర్శనం విజయభాను ఆదిలాబాద్ ఆర్‌ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్‌ఎంను కార్యాలయం ఉద్యోగులు, ఆయా సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సన్మానించారు.


