హన్మకొండ అర్బన్ : జనగణన –2027 తొలి విడతలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె సోమవారం కలెక్టర్, ఇతర అధికారులతో జనగణన, మ్యాపింగ్, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కొనసాగుతుందని, ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఇందుకు ప్రతీ 300 ఇళ్లు లేదా 750–800 జనాభాకు ఒక ఎన్యుమలేటర్‌ను నియమించాలని ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ జిల్లా జనగణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జనగణన 2027 మొదటి విడతలో చేపట్టనున్న ఇళ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని జనగణన సంచాలకులు భారతీ హోలీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు, ఆర్‌డీఓలు, సీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.


