● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి పోయలేదని, శ్రమ బీఆర్‌ఎస్‌ది.. శిలాఫలకం కాంగ్రెస్ వేస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ విమర్శించారు. సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కేతిరి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అన్ని కులసంఘాలు, మహిళా సంఘాల నిర్మాణానికి నిధులు తీసుకొస్తే వాటిని ఇంకా పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 14, 3వ డివిజన్ ప్రజల భద్రత కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులకు భయపడేది లేదని, ప్రతీ కార్యకర్తకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో 14వ డివిజన్ నాయకులు నరసింహ, భాస్కర్, సుభాష్, రాజపోషాలు, మల్లయ్య, రాజు, యాదగిరి, అశోక్ చారి, శంకర్, అఫ్జల్, సలీం, మాధవి, సమ్మక్క, హైమావతి, వీరాచారి, కల్యాణ్, శ్రీనివాస్, వనజ, లక్ష్మి, నవీన్, కుమారస్వామి, సాంబయ్య పాల్గొన్నారు.


