రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి..

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి..

రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి..

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌.. అన్నదమ్ములకు తీవ్ర గాయాలు

చికిత్స పొందుతూ తమ్ముడి మృతి..నక్కలపల్లిలో ఘటన

మామునూరు : అప్పటి వరకు తల్లితోపాటు కుటుంబీకులతో ఆనందంగా గడిపిన కుమారులు కొద్దిసేపటికే తీరని విషాదం మిగిల్చారు. అన్నను రైలు ఎక్కించేందుకు తమ్ముడు బైక్‌ తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరు కలిసి సంతోషంగా బయలుదేరారు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. మార్గమధ్యలో టిప్పర్‌.. బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తమ్ముడు మృతి చెందాడు. దీంతో చేతికొచ్చిన కుమారుడు కనిపించనిలోకాలకు తరలడంతో తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల కథనం ప్రకారం.. మామునూరు పీఎస్‌ పరిధి గుంటూరుపల్లికి చెందిన కొల్లం సుగుణకు ఇద్దరు కుమారులు రామకృష్ణ, వెంకటేష్‌(28) ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నను వరంగల్‌ స్టేషన్‌లో రైలు ఎక్కించేందుకు తమ్ముడు వెంకటేష్‌ తన బైక్‌పై ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్‌–నెక్కొండ ప్రధాన రహదారిపై ఖిలా వరంగల్‌ మండలం నక్కలపల్లి శివారులో బైక్‌ను వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పైనుంచి పడడంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షణాల్లో 108లో వరంగల్‌ ఎంజీఎం తరలించగా వెంకటేష్‌ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 9.30 గంటలకు మృతి చెందాడు. రామకృష్ణ చికిత్స పొందుతున్నాడు. అప్పటి వరకు తల్లితో గడిపిన కుమారులు రోడ్డు ప్రమాదంలో గాయపడడం.. చిన్న కుమారుడు వెంకటేష్‌ మృతి చెందడంతో కుటుంబీకులు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గుంటూరుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కష్టాలు తీరాయనుకునే సమాయాన కొడుకు మృతి చెందడంతో తల్లి సుగుణ గుండెలవిసేలా రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement