డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఈనెల 14న రెండో విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్‌పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో, ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, ఫర్నిచర్, తాగునీరు, భోజన వసతి, తదితర ఏర్పాట్లు కల్పించారు. శనివారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.


