‘కోచ్’.. చకచకా...
శరవేగంగా కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200 మల్టిపుల్ కోచ్‌ల సామర్థ్యం గల యూనిట్‌ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అత్యాధునిక టెక్నాలజీ సిస్టంతో రాత్రి, పగలు నిర్మిస్తున్నాయి. 160 ఎకరాల్లో రూ.586 కోట్లతో 2023లో ప్రారంభించిన ఆర్‌ఎంయూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో మల్టీపర్పస్ కోచ్‌ల తయారీ, వందేభారత్ కోచ్‌లను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్ట్‌ను తనిఖీ చేసి పనులు పరిశీలించారు. త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికాలను ఆదేశించారు. ఆర్‌ఎంయూ ప్రధాన షెడ్లలో యంత్రాల ఫిట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
ట్రాక్ పనులు, ఆర్‌యూబీ నిర్మాణం
ఆర్‌ఎంయూలో తయారైన ఇంజన్లు బయటకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యపురం గ్రామ ప్రజల కోసం, రైల్వే గేట్‌లో నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఆర్‌యుబీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
భూములిచ్చాం..
ఉద్యోగాలివ్వాలి: నిర్వాసితులు
‘జీవనోపాధికి ఆధారమైన భూములను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చాం. ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, రైల్వే అధికారులు, జిల్లా అధికారులను కలిసి కోరాం. ఇప్పటికై నా మా గోడును ఆలకించి ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి’ అని 114 మంది అయోధ్యపురం భూనిర్వాసితుల కుటుంబాలు కోరుతున్నాయి.
రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్
ప్రధాన షెడ్లలో కొనసాగుతున్న
యంత్రాల ఫిట్టింగ్
షెడ్డునుంచి బయటకు కనెక్టివిటీ
ట్రాక్ సిద్ధం
రాకపోకలకు ఆర్‌యూబీ నిర్మాణం
వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు
ఆర్‌ఎంయూ ప్రాజెక్ట్‌లో నిర్మించేవి ఇవే..
మెయిన్‌షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పంప్‌హౌజ్, టాయిలెట్ బ్లాక్, ప్యాకెజ్ సబ్‌స్టేషన్, శౌవర్ టెస్ట్, రోడ్ వే బ్రిడ్జి, పంప్ హౌజ్, జీఎల్‌ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్టు, ట్రాక్ గేట్, ఆర్‌యూబీ, పార్కింగ్, 2,000 కేఎల్ కెపాసిటీ పాండ్, స్కార్ప్ బిన్స్, టర్న్‌బ్రిడ్జి, బౌండ్రివాల్, బాలెస్ట్‌ట్రాక్, రోడ్, పాత్‌వే, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు.
‘కోచ్’.. చకచకా...
‘కోచ్’.. చకచకా...


